Kadem Project : మంత్రి అల్లోలకు ఫోన్… కడెం ప్రాజెక్టుపై సీఎం ఆరా
Kadem Project : కడెం ప్రాజెక్టు డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఏ ప్రాజెక్టుకు సామర్థ్యానికి మించి వరదనీరు పోటెత్తుతుండడంతో ఇప్పటికే ప్రాజెక్టు గేట్లన్నీ ఎత్తి 3 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కానీ ఎగువ నుంచి 5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు వస్తోంది. దీంతో అధికారులు ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు. మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి కడెం ప్రాజెక్టు వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వరద నీరు ప్రమాదకర స్థితికి చేరుకుందని అన్నారు. కడెం పరిసర గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. ఎగువ ప్రాంతంలోని ఎస్సారెస్పీ, బోద్ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వరద నీరు ప్రాజెక్టులోకి చేరడంతో ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పారు. ప్రాజెక్టు వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్కు నివేదిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక సీఎం కేసిఆర్ కూడా మంత్రి అల్లోలకు ఫోన్ చేసి కడెం ప్రాజెక్టు పరిస్థితిపై ఆరా తీశారు.
మరోవైపు 12 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కడెం ప్రాజెక్టు లెఫ్ట్ ఛానల్ మైసమ్మ గుడి దగ్గరే అడ్డుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాండవాపూర్ చెక్ పోస్ట్ సమీపంలోని ప్రధాన రహదారిపై నుంచి కడెం ప్రాజెక్టు వరద ప్రవహిస్తోంది. భారీ వరదల కారణంగా కడెం ప్రాజెక్టుకు తుది హెచ్చరిక జారీ చేశారు. అధికారులు NDRF బృందాల సహాయం కోరారు. కడెం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా 700 అడుగులు నిండాయి. ప్రాజెక్టుకు 18 గేట్లు ఉండగా మొత్తం 17 గేట్లను ఎత్తారు. ఇన్ ఫ్లో భారీగా.. ఔట్ ఫ్లో తక్కువగా ఉండడంతో ఈ పరిస్థితి నెలకొంది. అందుకే అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించి రాత్రి నుంచే గ్రామాలను ఖాళీ చేయించారు. ఇప్పటికే ప్రాజెక్టులోని వరద నీరు వచ్చి గ్రామాల్లోకి వచ్చి చేరుతోంది. కడెం, కన్నాపూర్, గొడ్గూడెం, రాంపూర్, మున్యాల్, గొడిసిర్యాల, పాండవాపూర్, అంబారిపేట్, కొందుకూరు, బూత్కూరు, గొడ్గూడెం గ్రామాలపై ఈ ప్రాజెక్టు ప్రభావం ఎక్కువగా ఉంటుంది.