CM KCR : వరద ప్రభావిత జిల్లాకు కోటి రూపాయలు
CM KCR announces Rs 1 crore for every flood-affected district : తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు వరంగల్ లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఈ మేరకు నిన్ననే వరంగల్ చేరుకున్న ముఖ్యమంత్రి వరదలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వరంగల్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల సంభవించిన వరదలు, నష్టంపై టీఆర్ఎస్ సీనియర్ నేత నివాసంలో మంత్రులు టీ హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎంపీ లక్ష్మీకాంతరావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ తదితరులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో గోదావరి ఒడ్డున నివసించే ప్రజలకు శాశ్వత రక్షణ కల్పించాల్సిన ఉందని, కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
వరదల కారణంగా అతలాకుతలమైన భద్రాద్రి-కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్ జిల్లాల కలెక్టర్లకు తక్షణం రూ.కోటి చొప్పున బడ్జెట్ ను అత్యవసర అవసరాల నిమిత్తం విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి హరీష్ రావు ను ఆదేశించారు. గోదావరిలో వరద ప్రవాహం, నది, ఉపనదుల కాంటూర్ లెవెల్స్‌పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నదికి గతంలో ఎన్ని లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైందని నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరం నుండి ఏటూరునాగారం, మంగపేట మీదుగా భద్రాచలం వరకు దాని ఒడ్డున కట్టలు/రక్షణ గోడల పటిష్టతను కూడా అధికారులు పరిశీలించాలని కోరారు.
కడెం ప్రాజెక్టుకు వరద సామర్థ్యం 2.95 లక్షల క్యూసెక్కులు మాత్రమే ఉందని, అయితే చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రాజెక్టుకు ఐదు లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని, ఈ అరుదైన ఘటనను దృష్టిలో ఉంచుకుని సమగ్ర సర్వే నిర్వహించి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఉందన్నారు. నీటిపారుదల శాఖలో పని చేసి పదవీ విరమణ పొందిన, నిపుణులైన ఇంజనీర్ల సూచనలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
లోతట్టు ప్రాంతాలలో ముంపునకు గురవుతున్న ప్రజలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉందని, యుద్ధప్రాతిపదికన వైద్య శిబిరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని హరీశరావును ఆదేశించారు. గోదావరిలో వరద ప్రవాహం మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్నందున కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆదివారం వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన అనంతరం ఏటూరునాగారంలో అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు.
ఎంపీలు పసునూరి దయాకర్, జోగినిపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, ఎస్ మధుసూదనాచారి, బస్వరాజ్ సారయ్య, తక్కలపల్లి రవీందర్ రావు, బండ ప్రకాష్, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, నన్నపునేని నరేందర్, అరూరి రమేశ్, వొడితెల సతీష్, వొడితెల సతీష్‌బాబు, బంతో శంకర్ నాయక్, పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు సమీక్షా సమావేశానికి హాజరయ్యారు.