Floods Politics: ఏరియల్ సర్వేకు సీఎం కేసీఆర్..ఫీల్డ్ విజిట్ కి గవర్నర్
Telangana Floods Politics:కేంద్రం మీద మీద సీఎం కేసీఆర్ పోరాటం చేయటం మొదలు పెట్టినప్పటి నుంచి రాజ్‌భవన్,ప్రగతి భవన్ ల మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తుంది. ఒకప్పుడు సీఎం కేసీఆర్ ప్రధాని మోడీతో సఖ్యతతో ఉండేవారు. అనేక అంశాల మీద పార్లమెంట్ లోపల, బయట కూడా మోడీని సమర్ధిస్తూ వచ్చారు కేసీఆర్. డీమానిటైజేషన్ విషయంలోనైనా, కోవిడ్ సందర్భంగా ప్రధాని ఇచ్చిన సందేశాల్ని అమలు చేయడంలో కేసీఆర్ ముందున్నారు. కానీ తర్వాత పరిణామాలు మారిపోయాయి. ఇరువురి మధ్య అంతరం పెరుగుతూ వచ్చింది. మోడీతో పెరిగిన గ్యాప్ ప్రభావం రాజ్‌భవన్ మీద పడింది. గవర్నర్ తమిళి సైతో మొదలైన చిన్న చిన్న అంతరాలు సీఎం,గవర్నర్ మధ్య పెద్ద అగాధాన్ని సృష్టించాయి.ప్రస్తుతం తెలంగాణని ముంచెత్తుతున్న వరద ప్రాంతాల్లో బాధితుల్ని పరామర్శించడానికి వేరు వేరు మార్గాల్లో ఇరువురు బయలు దేరడంతో రాజ్ భవన్,ప్రగతి భవన్ మధ్య గ్యాప్ పై మరో సారి ఆసక్తికర చర్చ నడుస్తుంది.
గవర్నర్ ఎమ్మెల్సీ ఫైలుని తిప్పి పంపించినప్పటి నుండి రాజ్‌భవన్,ప్రగతి భవన్ ల మధ్య గ్యాప్ పెరగడం మొదలైంది. అంతకు ముందు ప్రతి చిన్న విషయానికి గవర్నర్ తో చర్చించే కెసిఆర్ ఆ తర్వాత అసలు రాజ్ భవన్ కి వెళ్ళడమే మానేశారు. తెలంగాణా ప్రభుత్వం కనీస ప్రోటోకాల్స్‌ని కూడా పాటించడం లేదని ఢిల్లీ వెళ్ళి మరీ ఫిర్యాదు చేశారు గవర్నర్ తమిళి సై. అంతటితో ఆగకుండా రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల మీద రాజ్‌భవన్ లోనే మహిళా అదాలత్ ని ఏర్పాటు చేసి ఫిర్యాదులు తీసుకోవడం మొదలు పెట్టారు. ఇటీవల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం సందర్భంగా దాదాపు 9 నెలల తర్వాత మొదటిసారిగా కేసీఆర్ రాజ్‌భవన్ కి వెళ్ళారు. రాజ్యాంగ బద్ధంగా జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, గవర్నర్ ఇద్దరూ ఎంతో సఖ్యతతో కనిపించారు. ఇరువురి మధ్య ఏరకమైనా పొరపొచ్చాలు లేవు అన్నంతగా ఇద్దరూ కలిసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
ఇక దాదాపు మూడు దశాబ్దాల తర్వాత గోదావరి మహోగ్రరూపంతో తెలంగాణా ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పరిస్ధితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తాజాగా రేపు వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయబోతున్నారు ముఖ్యమంత్రి. సరిగ్గా అదే సమయానికి వరద ప్రాంతాల్లో తాను పర్యటించబోతున్నానని గవర్నర్ తమిళి సై ప్రకటించారు. ముందుగా అనుకున్న ప్రకారం గవర్నర్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళాల్సి ఉంది. కానీ, ఆ పర్యటనను సైతం రద్దు చేసుకుని రైలు మార్గంలో కొత్తగూడెం చేరుకుని భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ప్రజల్ని కలుసుకుని రెడ్ క్రాస్ ద్వారా తగిన సాయం అందించబోతున్నామని గవర్నర్ ప్రకటించారు.
సీఎం పర్యటన కూడా రేపే ఉంది కదా అని మీడియా అడిగిన ప్రశ్నకి అది ముఖ్యమంత్రి డ్యూటీ కదా..ఆయన పని ఆయన చేస్తారు అంటూ సింపుల్ గా చెప్పారు గవర్నర్. మొత్తం మీద ఈ పర్యటనలు చూస్తుంటే ఈ వ్యవహారం మరింత ముదిరే అవకాశం కనిపిస్తుంది. కేసీఆర్ ని ప్రగతి భవన్ నుంచి గవర్నర్ బయటకు రప్పించారంటూ బీజేపీ నాయకులు ప్రచారం చేయడానికి ఇదొక రాజకీయ అంశంగా మారే అవకాశం ఉంది.