ధాన్యం కొనుగోలుపై కేంద్రం క్లారిటీ..
ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. ధాన్యం కొలుగోలు విషయంలో ఏ రాష్ట్రంపై వివక్ష చూపించలేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. పంజాబ్‌లో అనుసరిస్తున్న విధానాన్నే తెలంగాణలో అనుసరిస్తున్నామన్నారు. రా రైస్ ఎంత ఇస్తామనే దానిపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఇంతవరకు సమాచారం ఇవ్వలేదన్నారు. తెలంగాణ నేతలు అబద్దాలు చెబుతున్నారన్నారు. తెలంగాణ నేతల అసత్యాలతో అక్కడి రైతులను ఇబ్బందులు పెడుతున్నారన్నారు.
ఫిబ్రవరి 22, మార్చి 8న నిర్వహించిన సమావేశాలకు రావాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరామన్న పీయూష్.. ఆ సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు రాలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని కేంద్ర మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అన్ని రాష్ట్రాలతో చేసుకున్న ఒప్పందం మేరకు.. కేంద్ర ప్రభుత్వం బియ్యం సేకరిస్తుందని తెలిపారు. పంజాబ్ నుంచి కూడా బియ్యాన్నే సేకరిస్తున్నామన్న కేంద్ర మంత్రి.. నేరుగా ధాన్యాన్ని సేకరించడం లేదన్నారు. రైతులను భ్రమలో పడేస్తూ కేంద్రంపై తెలంగాణ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని పీయూష్ గోయల్ మండిపడ్డారు.