అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో కొత్త విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ఊపందుకున్నాయి. పాఠశాలల్లో గత ఏడాది కంటే 10 శాతానికి మించి ఫీజులు పెంచరాదని గతంలోనే విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసినా చాలా ప్రైవేటు సంస్థలు 20 నుండి 30శాతం వరకు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి.
Educaton Fee: అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో కొత్త విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ఊపందుకున్నాయి. పాఠశాలల్లో గత ఏడాది కంటే 10 శాతానికి మించి ఫీజులు పెంచరాదని గతంలోనే విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసినా చాలా ప్రైవేటు సంస్థలు 20 నుండి 30శాతం వరకు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొవిడ్‌లో విద్యారంగం అస్తవ్యస్తంగా మారిపోయింది. ఎక్కువ మేరకు విద్యార్థులకు ఆన్లైన్ ద్వారానే పాఠాలను బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే కేవలం ట్యూషన్ ఫీజులను మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే క్షేత్రస్థాయిలో కార్పొరేట్ స్కూల్ యాజమాన్యాలు ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి. ఆస్తులమ్ముకొని పిల్లలకు పీజులు చెల్లించే రోజులచ్చాయని తల్లిదండ్రులు వాపోతున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఫీజులు చూస్తే కళ్లు తిరగాల్సిందే. వామ్మో ఇంత ఫీజులా అని ముక్కున వేలేసుకోవాల్సిందే. కొన్ని స్కూళ్లల్లో ఎల్కేజీ ఫీజులే సుమారు రూ.50 వేల నుంచి రూ.లక్ష మధ్యలో వసూళ్లు చేస్తున్నాయి. పాఠశాలల ప్రారంభానికి ఇంకో ఇరవై రోజులుండగానే ప్రైవేట్ స్కూళ్లు అడ్మిషన్ల ముసుగులో ఫీజుల మోత మోగిస్తున్నాయి. కొన్ని స్కూళ్లల్లో అయితే అడ్మిషన్లు అయిపోయినట్లు బోర్డులు పెట్టేసారు. తమ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం, కార్పొరేట్ చదువులు చెప్పించాలనే ఉద్ధేశ్యంతో అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూళ్లకు వెళుతున్న తల్లిదండ్రులు అక్కడి ఫీజులు చూసి వాటిని కట్టడం తమ వల్ల కాదని నిరాశతో వెనుదిరిగి వస్తున్న పరిస్థితి నెలకొంది. కొన్ని స్కూళ్లల్లో నాలుగో తరగతికి రూ. లక్షా 20 వేల నుంచి లక్షా 60 వేలకు పెంచారని చెబుతున్నారు. ఫీజులు ఇష్టం వచ్చినట్లు పెంచుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇస్టానుసారంగా ఫీజులు పెంచుతున్న ప్రైవేటు పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు, విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. సర్కారు నిబంధనలను లెక్క చేయకుండా, ఇష్టారాజ్యంగా నడుస్తున్న పాఠశాలలపై అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు యథేచ్ఛగా ఫీజుల దందా కొనసాగుతున్నా…అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు.
తెలంగాణలో దాదాపు 11 వేల నుండి15 వేల వరకు వరకు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 30 లక్షలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. అడ్మిషన్, టర్మ్, ట్యూషన్ ఫీజులంటూ ప్రజల నెత్తిమీద కుచ్చుటోపీ వేస్తున్నాయి. యూనిఫామ్స్, బుక్స్, నోట్ పుస్తకాలకు ఇబ్బడి ముబ్బడిగా బిల్లులు వేసేస్తున్నారు. ఇవన్నీ తమ వద్దే కొనాలని హుకూం జారీ చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు కార్పొరేట్ స్కూళ్లు ప్రభుత్వం నిర్ధేశించిన పాఠ్య పుస్తకాలను కాకుండా వారు రూపొందించిన పాఠ్యపుస్తకాల ద్వారా బోధన చేస్తున్నారు. వాటినే తమ పాఠశాలల్లోనే కొనాలని చెప్పి ఫీజులకు, పుస్తకాలకు లింకు పెడుతున్నారు. మరికొన్ని చోట్ల నోటు పుస్తకాలు, యూనిఫాం తమ వద్దనే కొనాలని ఆదేశిస్తూ చివరకు ఫీజు కట్టడం తప్పనిసరి చేస్తున్నాయి. ట్యూషన్ ఫీజుకు అదనంగా స్కూల్ డెవలప్మెంట్ ఫండ్, ల్యాబ్స్, గ్రౌండ్, కంప్యూటర్ తదితర ఫీజులను వసూలు చేస్తుంటారు. ట్యూషన్ ఫీజు 50శాతం ఉంటే మిగతా ఫీజులు మరో 50శాతం వరకు ఉంటాయి. ఆ మొత్తాన్ని విభజించి మూడు, నాలుగు టర్మ్‌లుగా ఫీజులను వసూలు చేస్తున్నాయి.
కార్పొరేట్ యాజమాన్యాల తీరుతో తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇప్పటికే కరోనా కారణంగా ఆదాయాలు కోల్పోయి అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఫీజులు కట్టేదేలా? అని తలలు పట్టుకుంటున్నారు. తల్లి దండ్రులకు వర్క్ ఫ్రం హోం తో జీతాలలో సగం కోతకోశారు. అదేకాకుండా కరొనతో కొన్నిరంగాలు బాగా దెబ్బతినడంతో కొన్ని సంస్థలు మూతబడడంతో అందులో పనిచేసే ఉద్యోగులు రోడ్డునపడ్డారు. ఇలాంటి పరిస్థితిల్లో కూడా ప్రవేట్ స్కూళ్లల్లో పీజుల పేరుతో దోపిడీ చేస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు అప్పులుచేసి పిల్లలకు పీజులు కట్టే పరిస్తితివచ్చిందని అంటున్నారుతల్లిదండ్రులు. పిల్లల చదువులేమోగాని పీజులు అరికట్టేవారేలేరని అంటునారు. కార్పొరేట్ స్కూల్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నది. నామమాత్రపు తనిఖీలు నిర్వహిస్తూ చేతులు దులుపుకుంటుందని విమర్శలుకూడా ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల విషయంలో సరైన నియంత్రణ లేకపోవడంవల్ల పాఠశాలల యాజమన్యాలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.