TDP – BJP Alliance: సైకిల్‌తో కమలం దోస్తీ..ఖాయమా..!
Chances for TDP BJP Alliance In Telugu States: తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ పొత్తుల దిశగా ఆలోచిస్తోందా? మళ్లీ సీజనల్ మిత్రపక్షం టీడీపీతో జట్టు కట్టేందుకు సిద్ధమవుతోందా? అంటే.. జాతీయ నాయకత్వం ఆలోచనలు ఈ దిశగానే సాగుతున్నాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే టీడీపీతో పొత్తు తమకు కలిసివస్తుందా? లేక నష్టం చేస్తుందా? అని వారు మధనపడుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి తెలంగాణలో సొంతంగానే అధికారంలోకి వచ్చేంతగా బలపడాలని కమలనాథులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం బీఆర్ ఎస్ సర్కారుపై దూకుడు వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటిదాకా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ను కొంత మేర వెనక్కి నెట్టగలిగారు. ఇదే ఊపులో ముందుకెళ్లి అధికారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ సంస్థాగతంగా అంతగా బలంగా లేకపోవడం వారికి మైనస్ గా మారింది.
ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకోవడం ద్వారా బలపడాలన్న ప్రయత్నాలు అంతగా సఫలీక్రుతం కావడంలేదు. కాషాయ కండువా కప్పుకొనేందుకు తెలంగాణ నేతలు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మొత్తం 119 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టలేని ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. గత (2018) ఎన్నికల్లో 100కు పైగా స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన అనుభవం కళ్లముందు కనిపిస్తూనే ఉంది. దీంతో ఏదో ఒక పార్టీతో జట్టు కట్టక తప్పదన్న ఆలోచన జాతీయ నాయకత్వం చేస్తున్నట్టు తెలుస్తోంది. అది టీడీపీ అయితే ఎలా ఉంటుందని పరిశీలిస్తోంది. కానీ, తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం ఇందుకు అంత సుముఖంగా లేరని అంటున్నారు. పొత్తుల వల్ల పార్టీ సంస్థాగతంగా బలపడే అవకాశాలు కోల్పోతుందని, పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేయాల్సిన పరిస్థితి చాలా మంది ఆశావహులకు ఎదురవుతుందని భావిస్తున్నారు. పైగా టీడీపీతో పొత్తు అంటే పరిణామాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన వారిలో ఉంది. 2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తుతోనే బీజేపీ ఎన్నికలకు వెళ్లింది. అప్పుడు కొ్ంతమేరకు ప్రయోజనం కూడా పొందింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఐదుగురు ఎమ్మల్యేలు బీజేపీ తరఫున గెలిచారు.
చాలా నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గణనీయంగా ఓట్లు దక్కించుకోగలిగారు. అయితే అప్పటికి ఇంకా రెండు రాష్ట్రాలు వేరు కాలేదు. ఎన్నికల ఫలితాలం అనంతరం జూన్ 2ను అపాయింటెడ్ డేగా నిర్ణయించి రెండు ప్రభుత్వాలు ఏర్పటయ్యాయి. ఆ తరువాత టీడీపీపై ఆంధ్ర పార్టీగా ముద్ర వేస్తూ దానిని దెబ్బతీసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుపరిచారు. దీంతో ఆ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు, నేతలు వరుస కట్టి బీఆర్ ఎస్ (నాటి టీఆర్ ఎస్)లో చేరారు. ఆ తరువాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ టీడీపీ ప్రభావం లేకుండా పోయింది. టీడీపీలో కొనసాగినా, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నా రాజకీయంగా నష్టం తప్పదన్న స్థాయికి పరిస్థితి దిగజారింది. 2018 ముందస్తు ఎన్నికల్లో దీనిని అంచనా వేయడంలో విఫలమైన కాంగ్రెస్.. టీడీపీతో పొత్తు పెట్టుకొని తీవ్రంగా నష్టపోయింది. ఆంధ్ర పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నారని, తాను వెళ్లగొట్టిన చంద్రబాబును మళ్లీ తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ కేసీఆర్ ప్రచారం చేశారు. దీంతో తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వానికే జైకొట్టారు. ఫలితంగా కాంగ్రెస్ అధికారం దక్కే అవకాశాలు ఉన్నా.. టీడీపీ వల్ల చేజార్చుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత రాష్ట్రంలో పరిణామాలు వేగంగా మారిపోయాయి.
వెంటనే జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి నాలుగు స్థానాలు దక్కడంతో ఆ పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణపై గురి పెట్టింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో రోజురోజుకీ దిగజారిపోయింది. ఫలితంగా పోరాటం టీఆర్ ఎస్ వర్సెస్ బీజేపీ అనే స్థాయికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో రెండు ఉప ఎన్నికల్లో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సాధించిన విజయాలతో టీఆర్ ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అంటూ బీజేపీ ప్రచారం చేసుకుంటోంది. ఈ పరిస్థితుల్లోనే కేసీఆర్ తాను జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్నానంటూ టీఆర్ ఎస్ పేరును బీఆర్ ఎస్‌గా మార్చారు. ఏపీలోనూ పోటీ చేస్తామంటూ అక్కడ శాఖను, అధ్యక్షుడిని కూడా నియమించారు. దీంతో టీడీపీని ఇక ఆంధ్ర పార్టీ అని విమర్శించే అవకాశం కేసీఆర్‌కు ఉండదని భావించిన చంద్రబాబు నాయుడు మళ్లీ తెలంగాణలో బలపడేందుకు ప్రయత్నాలుమొదలు పెట్టారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించి తమ బలాన్ని ప్రదర్శించారు.
తమ పార్టీ నుంచి నేతలు వెళ్లిపోయినా ప్రజల్లో టీడీపీ పట్ల అభిమానం చెక్కు చెదరలేదని అన్నారు. టీడీపీని వీడిన నేతలంతా తిరిగి పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు. బీజేపీతో పొత్తు కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో బీజేపీకి తమతో పొత్తు పెట్టుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితిని కల్పించడం ద్వారా ఏపీలోనూ బీజేపీతో కలిసి వెళ్లాలని యోచిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే జనసేనతోపాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సహకారం అవసరమని ఆయన భావిస్తున్నారు. అయితే తెలంగాణలో టీడీపీతో పొత్తు తమకు ఏ మేరకు కలిసి వస్తుందని బీజేపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. గతంలో మాదిరిగా టీడీపీకి బలం లేదని, అది ఇప్పుడు ఎంతమాత్రమూ నిర్ణయాత్మక శక్తి కాదనే అభిప్రాయంతో ఉన్నారు. అయితే ఇప్పటికీ నియోజకవర్గస్థాయి నాయకుల కొరత ఉన్న కమలం పార్టీ.. ఒంటరిగా బీఆర్ ఎస్‌ను ఎదుర్కొనే అవకాశాలు తక్కువేనన్నది రాజకీయ పరిశీలకు అంచనా. ఈ నేపథ్యంలో టీడీపీతో పొత్తు తప్పనిసరి కావచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.