తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలయింది. నోటిఫికేషన్ కూడా రాకముందే నేతలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ప్రధాన పార్టీలన్నీ గెలుపుపైనే ఫోకస్ పెట్టి ఆ దిశగా పావులు కదుపుతున్నాయి. ఈక్రమంలో పొత్తు రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. మళ్లీ పాత స్నేహాలు చిగురిస్తున్నాయి.
Telangana: తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలయింది. నోటిఫికేషన్ కూడా రాకముందే నేతలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ప్రధాన పార్టీలన్నీ గెలుపుపైనే ఫోకస్ పెట్టి ఆ దిశగా పావులు కదుపుతున్నాయి. ఈక్రమంలో పొత్తు రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. మళ్లీ పాత స్నేహాలు చిగురిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా సీపీఐ పార్టీ కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తున్నప్పటికీ.. సీపీఎం మాత్రం చాలా ఏళ్లుగా దూరంగా ఉంటోంది. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ పార్టీలు ఒక్కతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గులాబీ బాస్‌ను ఢీ కొట్టేందుకు ఆ మూడు పార్టీలు ఏకమవుతున్నాయి. ఈ మేరకు రహస్యంగా చర్చలు జరుగుతున్నాయి.
ఆదివారం కాంగ్రెస్ మధ్యవర్తి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల నేతలతో రహస్యంగా సమావేశమయినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, వెంకట్ రెడ్డి హాజరయినట్లు సమాచారం. ఎన్నికల పొత్తుకు సంబంధించి వారి అభిప్రాయం తెలుసుకునేందుకు ఈ సమావేశమయ్యారట. సీపీఐ నేతలు పొత్తుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే గతంలో సీట్ల సర్దుబాట్లలో సాగదీత వల్ల సానుకూల ఫలితాలు రాలేదు. ఈక్రమంలో ఈసారి సీట్ల సర్దుబాటు విషయంలో మాత్రం సాగదీత తగదని స్పష్టం చేశారట. ఒకటి రెండు రోజుల్లోనే సర్దుబాటు విషయం తేలిపోవాలన్నారట. దీనిపై కాంగ్రెస్ నిర్ధిష్ట ప్రాణాళికతో రావాలని సూచించడంతో పాటు.. సీపీఎం రాష్ట్ర నాయకత్వంతో చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామని సీపీఎం నేతలు స్పష్టం చేశారట. ఓవర్ ఆల్గా మాత్రం పొత్తుకు సీపీఎం సానుకూలత వ్యక్తపరిచినట్లే తెలుస్తోంది.
కానీ ఇక్కడే పెద్ద చిక్కుముడొచ్చి పడింది. కొత్తగూడెం, బెల్లంపల్లి, మునుగోడు, వైరా, పాలేరు, మధిర, మిర్యాలగూడ, భద్రాచాలం స్థానాలను కమ్యూనిస్ట్ పార్టీలు అడిగే అవకాశం ఉంది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్.. కొత్తగూడెం, భద్రాచలం, మధిర, పాలేరు స్థానాల్లో గెలుపొంది తమ జెండాను పాతింది. తిరిగి ఆయా స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈక్రమంలో సీట్ల సర్దుబాటు ఆయా పార్టీలకు పెద్ద సవాల్‌గా మారనుంది.
మరోవైపు కొంతకాలంగా ఎన్నికల్లో సీపీఐ కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తోంది. కానీ మునుగోడు బై ఎలక్షన్స్‌లో మాత్రం కాంగ్రెస్‌ను కాదని.. బీఆర్ఎస్కు జై కొట్టింది. అటు సీపీఎం కూడా బీఆర్ఎస్కు మద్ధతు ఇచ్చింది. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్తో కలిసి పోటీ చేయాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అనుకున్నాయి. ఇందుకోసం బీఆర్ఎస్తో కలిసి సీట్ల సర్దుబాటు కోసం ఎదురు చూశాయి. కానీ ఆ పార్టీలకు గులాబీ బాస్ కేసీఆర్ ఊహించని షాక్ ఇచ్చారు. సీపీఎం, సీపీఐ కోరిన స్థానాల్లో కూడా కేసీఆర్ తమ అభ్యర్థులను ప్రకటించేశారు. ఆ పార్టీలకు మొండి చేయి చూపించారు. దీంతో కంగుతున్ని సీపీఎం, సీపీఐ పార్టీలు.. తిరిగి కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. మరి సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ ఒక్కతాటిపైకి వస్తాయా?.. గులాబీ బాస్‌ను ఢీ కొడుతాయా?.. సీట్ల సర్దుబాటు విషయంలో ఏ పార్టీ వెనక్కి తగ్గుతుంది? అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.