MLA Rajaiah: సద్దుమణిగిన ఎమ్మెల్యే రాజయ్య సర్పంచ్ వ్యవహారం
MLA Rajaiah: మహిళా సర్పంచ్ నవ్యపై లైంగిక వేధింపుల వ్యవహారంలో ఎట్టకేలకు బీఆర్‌ఎస్ స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య క్షమాపణ చెప్పారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటానని విలేకరుల సమావేశంలో హామీ ఇచ్చారు. మానసిక క్షోభకు గురి చేసి ఉంటే.. మహిళా సమాజానికి క్షమాపణలు చెప్తున్నా అని తెలిపారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం గ్రామ సర్పంచ్ కురసపల్లి నవ్య.. ఎమ్మెల్యే రాజయ్య లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పంచాయితీ పార్టీ పెద్దలదాకా వెళ్ళింది.
పరిస్థితి చేయిదాటిపోతోందని గ్రహించిన బీఆర్‌ఎస్ పెద్దలు.. పల్లా రాజేశ్వర్ రెడ్డి ని రంగంలోకి దింపారు. సమస్యను వెంటనే పరిష్కరించుకోవాలని అధిష్టానం ఆదేశించినట్టు సమాచారం. అదేవిధంగా పల్లా నవ్య, ఆమె భర్త ప్రవీణ్‌తో కూడా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఏ విషయమైనా మీడియా సమక్షంలోనే మాట్లాడాలని నవ్య దంపతులు కోరారు. ఈ నేపథ్యంలో రాజయ్య నవ్య ఇంటికి వచ్చారు. ప్రవీణ్, నవ్య దంపతులతో మాట్లాడిన తర్వాత వారితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధిస్ఠానం ఆదేశాల మేరకే జానకీపురం వచ్చానని రాజయ్య తెలిపారు. జరిగిన పరిణామాలకు చింతిస్తున్నానని చెప్పారు.