కీలక సమావేశంపై అంతటా ఉత్కంఠ నెలకొంది
BRS MEETING TODAY : తెలంగాణ భవన్లో ఇవాళ బీఆర్ఎస్ (BRS) పార్టీ కీలక సమావేశం (Key meeting) నిర్వహిస్తోంది. ఈ భేటీకి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా ముఖ్య నేతలు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్న విస్తృతస్థాయి భేటీలో ఏఏ అంశాలు చర్చిస్తారనే ఆసక్తి నెలకొంది. గత అనుభవాల దృష్ట్యా ముఖ్యమంత్రి కేసీఆర్ (Kcr) ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటారో అనే ఉత్కంఠ (excitement) ఏర్పడింది. గత ఎన్నికల సమయంలో ఇలాగే విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు (Advance Electons) వెళ్తున్నట్లు ప్రకటించి అందర్నీ నివ్వెర పరిచారు. విపక్షాలు ఎన్నికలకు సమాయయ్యం అయ్యేందుకు సమయం కూడా లేకుండా చేసి విజయం సాధించారు. ఇప్పుడు కూడా ఇలాంటి నిర్ణయం ఏదైనా ఉంటుందా? అని రాజకీయ వర్గాల్లో చర్చ (Political discussion) జరుగుతోంది. అయితే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వాటి వేదికగా సర్కార్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. 20 రోజుల పాటు నిర్వహించనున్న ఈ వేడుకలను పార్టీకి అనుకూలంగా మలచుకోవాలని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. మరి ఈ భేటీ వెనక మతలబు అదేనా? లేదంటే ముందస్తు గంట మోగిస్తారా? అనే తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ముందస్తు ప్రకటిస్తారా..?
కర్ణాకట ఎన్నికల ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్ (congress) నేతలు జోష్ మీద ఉన్నారు. ఇక్కడ కూడా ఇలాంటి ఫలితాలే రాబడతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోరాటాలు, ఉద్యమాలు ఉధృతం చేసి కన్నడ తరహాలోనే ఐక్యంగా పనిచేస్తామని చెబుతున్నారు. అంతర్గతంగా ఎన్ని విబేధాలు ఉన్నా వాటన్నింటిని పక్కన పెట్టి విజయం సాధిస్తామని అంటున్నారు. ఇటు బీజేపీ నేతలు కూడా కర్ణాటక ఫలితాలతో తెలంగాణలో సంబంధం లేదంటున్నారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పనిచేసిందని విశ్లేషిస్తున్నారు. ఇక్కడ కూడా ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని చెబుతున్నారు. అలాగే హిందుత్వ ఎజెండాను మరింత బలంగా బయటకు తీస్తున్నారు. కరీంనగర్లో హిందూ ఏక్తా యాత్ర పేరుతో భారీ ర్యాలీ నిర్వహించిన బీజేపీ (bjp) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) నిప్పులు చెరిగారు. హిందుత్వమే లేకుంటే భారత్ మరో పాకిస్తాన్ అయ్యేదన్నారు. కర్ణాటకలో జై బజ్రంగ్ బలి అన్నవాళ్లు కాంగ్రెస్ గెలవగానే పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నారని విమర్శించారు.
కలిసి వస్తుందా..?
వచ్చే సాధారణ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ మరింత పుంజుకుంటుందని బీఆర్ఎస్ (brs) అధినేత కేసీఆర్ అంచనా వేస్తున్నారు. కర్ణాటక గెలుపుతో ఆ పార్టీ దక్షిణాదిలో కొంత పట్టు పెంచుకునే అవకాశం ఉందని లెక్కలు వేస్తున్నారు. గత అనుభవాలు కూడా బేరీజు వేసుకుంటున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో (Andhra pradesh) అదే పార్టీ గెలిచేది. ఇప్పుడు కూడా అలాంటి పవనాలే వీస్తే అధికారం కోల్పోవడం ఖాయం. అయితే గడువు వరకు ఎన్నికలకు వెళ్లకుండా ఆగితే అది హస్తం పార్టీకి అవకాశం ఇచ్చినట్లు అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారట. అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లి కాంగ్రెస్‌ను పుంజుకోకుండా చేయాలనే ఎత్తుగడ వేస్తున్నారట. అదే క్రమంలో కర్ణాటక ఫలితాలు బీజేపీకి ఇబ్బందికరంగా మారాయి. మోడీ చరిష్మా తగ్గిపోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. డబుల్ ఇంజిన్ కాదు ట్రబుల్ ఇంజన్ అనేది జనం విశ్వసిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కమలనాథులు పైకి గంభీరం ప్రదర్శిస్తున్నా లోలోన మాత్రం కర్ణాటక భయం పట్టుకుంది. ఈ దెబ్బ నుంచి కోలుకోవాలంటే మరికొంత సమయం పడుతుంది. మరో రాష్ట్రంలో ఎన్నికల్లో పంజా విసిరి పులిలా విరుచుకుపడి విజయం ఎలాగైనా లాగేసుకునేలా వ్యూహం రచిస్తోంది.
ఏం తేలుస్తారు..?
బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తుండటం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. కేసీఆర్ ముందస్తు ఎన్నికల ప్రకటన చేస్తారా? లేదంటే పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేలా ప్రణాళికను ప్రకటిస్తారా? అనే చర్చ జరుగుతోంది. దశాబ్ది వేడుకలను ముందస్తు ఎన్నికలకు వేదికగా మలచుకొని ప్రజల్లోకి వెళ్లేలా దిశానిర్దేశం చేస్తారా? అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ముందస్తు ఎన్నికల ప్రకటన చేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయనే ప్రచారం జరుగుతుండగా.. పైకి చెప్పకపోయినా ఆ సంకేతాలిచ్చి నాయకులు ప్రజల్లో ఉండేలా ఆదేశాలిస్తారా అనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా కర్ణాటక (Karnataka) ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ నిర్వహిస్తున్న విస్తృత స్థాయి సమావేశం నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. 40 శాతం కమిషన్ ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ నేతలు బీజేపీని ఎండ గట్టగలిగారు. బొమ్మై సర్కార్‌కు బొమ్మ చూపించారు. తెలంగాణలోనూ కాళేశ్వరం సహా అనేక పనుల్లో భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఔటర్ రింగ్ రోడ్ 30 ఏళ్ల లీజు వ్యవహారం కూడా ఇలాగే దుమారం రేపింది. దళిత బంధు పంపిణీలో 30 శాతం కమిషన్లు తీసుకున్న విషయం తనకు తెలుసని ఏకంగా సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో అంతర్గత మీటింగ్‌లో చెప్పారట. ఈ నేపథ్యంలో ఎన్నికల గడువు వచ్చే వరకు ఆగకుండా ముందస్తుతో మరోసారి విజయం సాధించి తీన్ మార్ కొట్టాలని గులాబీ అధినేత వ్యూహంగా కనిపిస్తోంది. అలాగే రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయితే సాధారణ ఎన్నికల నాటికి దేశంలో మిగతా రాష్ట్రాలపై గురి పెట్టవచ్చని భావిస్తున్నారట. బీఆర్ఎస్ బలోపేతంతో పాటు తెలంగాణ మోడల్‌తో దూసుకెళ్లేందుకు మంచి తరుణమని అంచనా కొచ్చరాట.
పొత్తులు-ఎత్తులు..
విపక్షాలు పొత్తులు ఎత్తులతో ఏకమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ బీజేపీ, జనసేన (Janasena), టీడీపీ (Tdp) కలిసి పనిచేసేలా సంకేతాలు వస్తున్నాయి. టీడీపీతో కలిసి వెళ్లేందుకు ఇన్నాళ్లూ ససేమిరా అంటున్న కమలనాథులు కర్ణాటక ఫలితాలతో కొంత వెనక్కి తగ్గారు. పవన్ టీడీపీతో పొత్తు కోరుకుంటున్నారని.. తాము కూడా సిద్ధమవుతున్నామనే తరహాలో మాట్లాడుతున్నారు. ఇదే జరిగితే తెలంగాణలోనూ ఆ మూడు పార్టీలు కలిసి వెళ్లడం ఖాయం. ఈ ప్రమాదం కూడా ముంచుకు రాకముందే ముందస్తు మందే ఉత్తమమని కేసీఆర్ భావిస్తున్నారట.