బీజేపీ నేతలకు ఓ రోగం ఉంది.. అందుకే అబద్దాలు మాట్లాడుతారు: హరీష్ రావు
బీజేపీపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలకు శాపం ఉన్నట్టుందని మంత్రి అనుమానం వ్యక్తం చేశారు. వాళ్ళు నిజం మాట్లాడితే వారి తల వెయ్యి ముక్కలు అవుతుందనే శాపం ఉందని ఎద్దేవా చేశారు. అందుకే బీజేపీ నేతలు ఎప్పుడు చూసినా అబద్దాలు మాట్లాడుతుంటారన్నారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాల గురించి చెప్పినా వారు ఒప్పుకోరన్నారు. పాలమూరులో జరిగిన బీజేపీ సభలో పాల్గొన్న ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పచ్చి అబద్దాలు మాట్లాడారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా టీఆర్‌ఎస్ ప్రభుత్వం అదనంగా ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదనే అబద్దపు ప్రచారం చేశారన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటున్నారన్నారని మండిడ్డారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా ప్రాజెక్టును సొంత నిధులతో విజయవంతంగా పూర్తి చేసుకొని ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నీళ్ళు ఇస్తుంటే చూస్తు ఓర్వలేక బీజేపీ ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం ప్రారంభించిందని మండిపడ్డారు. కేంద్ర పథకాలను రాష్ట్ర పథకాలుగా అమలు చేస్తున్నట్లు మరొ అబద్దం చెప్పారన్నారు. బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న అక్కసుతో రాసి ఇచ్చిన అబద్దపు స్క్రిప్ట్‌ను చదవిన నడ్డా.. వాటిని నమ్మడం కంటే రాష్ట్రంలో పర్యటించి నిజాలు తెలుసుకోవాలన్నారు.