బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి నివాసానికి ఈటల వెళ్లిన సమయంలో ఈ విషయం బహిర్గతమైంది.
Telangana BJP: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి నివాసానికి ఈటల వెళ్లిన సమయంలో ఈ విషయం బహిర్గతమైంది. పొంగులేటితో భేటీకి సంబంధించి తనకెలాంటి సమాచారం లేదన్న బండి సంజయ్ వ్యాఖ్యలు పార్టీలో నేతల మధ్య సఖ్యత లేదన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు. తాజాగా కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో డీలా పడ్డ బీజేపీ.. పరిస్థితి ఇలాగే కొనసాగితే తెలంగాణలో పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కర్ణాటక ఎన్నికల ప్రభావంతో తెలంగాణలో బీజేపీ కేడర్ నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు నేతల మధ్య ఆధిపత్య పోరు కూడా పార్టీకి నష్టం చేకూరుస్తుందనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని పరిస్థితి చేయి దాటకముందే గాడిన పెట్టే ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ.
పార్టీలో కీలక నేతల మధ్య ఆధిపత్య పోరుతో రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి గందరగోళంగా మారింది. ఫలితంగా పార్టీ బలహీనపడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపత్యంలో అప్రమత్తమైన పార్టీ పెద్దలు వారి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈటల రాజేందర్… కేంద్ర హోమంత్రి అమిత్ షాని కలిసేందుకు సోమవారం హడావుడిగా ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై ఢిల్లీలో పెద్దలు ఎలా స్పందిస్తున్నారన్నది ప్రస్తుతానికి తెలియదు. ఐతే.. సీనియర్ రెబెల్ నేతలు.. హైకమాండ్‌తో మీటింగ్ కోసం ట్రై చేస్తున్నట్లు తెలిసింది. ఒక్క ఛాన్స్ ఇస్తే.. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పార్టీ ఎలా ఉందో వారు వివరించాలనుకుంటున్నట్లు సమాచారం. మిషన్ 90 నినాదంతో తెలంగాణలో అధికారం కోసం శ్రమిస్తున్న బీజేపీకి ఇది కొత్త తలనొప్పిగా మారింది.
తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతో అప్పటి నుంచి బీజేపీలో అగ్రనేతలెవరూ చేరట్లేదు. దీనిపై అసంతృప్తి నేతలు బండి సంజయ్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. తమ అల్టిమేటంపై హైకమాండ్ స్పందించకపోతే.. ఆ సీనియర్ నేతలు.. పార్టీకి గుడ్ బై చెప్పి కొత్త పార్టీ పెట్టి కనీసం 25 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిసింది. పార్టీలో చేరినప్పుడు యాక్టివ్ గా కనిపించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ తరవాత సైలెంట్ అయిపోయాడు. పార్టీకి, బండి సంజయ్ కి అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నాడు. దాంతో ఆయన అసంతృప్తి క్లారీటీ కనిపిస్తోంది. మరోవైపు ఈటల రాజేందర్, వివేక్ కూడా బండి సంజయ్ పై తీవ్రఅసహనంతో ఉన్నారట. అధిష్టానం ఒకవేళ బండి సంజయ్ ని మార్చకపోతే సొంత పార్టీని కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో బీజేపీ అసంతృప్తి నేతలు ఉన్నట్టు తెలుస్తోంది.
సార్వత్రిక ఎన్నికలకు సమయం కొద్ది నెలలు మాత్రమే ఉండడంతో, తెలంగాణ బిజెపిలో భారీగా ప్రక్షాళన చేపట్టకపోతే పార్టీ అధికారంలోకి రావడం కష్టమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కొంత మంది కీలక నేతలు బహిరంగంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ను తొలగించాలని డిమాండ్ ను తెరపైకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ బిజెపి లో బండి సంజయ్ వ్యవహారాలపై అధిష్టానం దృష్టి సారించిందని, కర్ణాటక ఎన్నికల ఫలితాలు తర్వాత అన్ని విషయాలను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తుందని, భారీగా ప్రక్షాళన చేపట్టేందుకు సిద్ధమైందని, దీనిలో భాగంగానే బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం మొదలైంది. ఇప్పటికే సంజయ్ వ్యవహారంపై పార్టీ అధిష్టానం అసంతృప్తితో ఉందనే వార్తలు వస్తున్నాయి.ఇప్పుడు అసమ్మతి నేతలు ఆయనకు వ్యతిరేకంగా గళం విప్పడం , ఈటెల రాజేందర్ కు పార్టీ బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ వినిపించడం ఇవన్నీ చర్చనీయాంసంగా మారాయి.
ఇక బీఆర్ఎస్ సస్పెండ్ చేసిన పొంగులేటితో కూడా బీజేపీ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. కానీ ఆయన బీజేపీలో చేరకపోవడానికి కూడా కారణం రాష్ట్ర బీజేపీలోని పరిస్థితులేనని అంటున్నారు. ఇక ఇప్పటికే ఈటెల రాజేందర్ ఢిల్లీ లో ఉన్నారు. ఇక ఈరోజు హస్తినకు బండిసంజయ్ కూడా పయనమవుతున్నారు. మరి ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో వేచిచూడాలి.