Ponguleti: పొంగులేటికి కేంద్ర ప్రభుత్వ భద్రత.. బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు!
BJP Galla Satyanarayana Crucial Comments on Ponguleti: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కేసీఆర్ భద్రత తగ్గించి ఇచ్చిన ఝలక్ కు ఆయన రివర్స్ షాక్ ఇవ్వబోతున్నారని అంటున్నారు. త్వరలో ఆయన పార్టీ మారుతున్నారని విస్తృతంగా చర్చ జరుగుతుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీ బాట పట్టాలని ఆలోచిస్తున్నట్లు, ఈ మేరకు త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతుంది. ఖమ్మం రాజకీయాలపై సీరియస్ గా ఉన్న పొంగులేటి ఇప్పటికే జిల్లాలో రహస్యంగా సర్వే చేయించి ఏ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? తాను ఏ పార్టీలోకి వెళితే తన భవిష్యత్తు బాగుంటుంది అన్న అంశం పైన అన్ని వివరాలు సేకరించినట్లు చెబుతున్నారు.
ఇక ఖమ్మం జిల్లాలో వచ్చే ఎన్నికల్లో టికెట్ల విషయంలో కూడా బీఆర్ఎస్ అధిష్టానం ముందు ప్రతిపాదనలు పెట్టిన పొంగులేటి తాను ఖమ్మం లేదా కొత్తగూడెం నుంచి పోటీ చేస్తానని ఇక తన వర్గానికి పినపాక, సత్తుపల్లి, వైరా, అశ్వరావుపేట, ఇల్లందులో అవకాశం కల్పించాలని కోరారు. దీనిపై అక్కడి నుండి సానుకూల స్పందన రాకపోవడంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారడానికి నిర్ణయం తీసుకున్నట్లు గా తెలుస్తుంది. ఆయన పార్టీ మారతారు అనే ప్రచారం నేపథ్యంలో ఆయనకు భద్రత తగ్గించినట్టు చెబుతున్నారు. అయితే తాజాగా ఈ అంశం మీద బిజెపి జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక మాజీ ఎంపీ పొంగులేటికి కేంద్ర ప్రభుత్వ భద్రత కల్పిస్తామని ఆయన అన్నారు. పార్టీ మారతాడనే సెక్యూరిటీని తగ్గించారని పేర్కొన్న ఆయన సంక్రాంతి తర్వాత బిజెపిలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయని అందుకు సమయం దగ్గరకు వచ్చిందని అన్నారు.