Bandi Sanjay Letter: కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ?
Bandi Sanjay Letter: కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. మీ పాలనలో ఉద్యోగ, ఉపాధ్యాయులు సహా ప్రజలంతా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారని, ఉద్యోగుల సమస్యలేవీ పరిష్కారం కావడం లేదని అన్నారు. తక్షణమే వేతన సవరణ సంఘం (PRC)ను ఏర్పాటు చేసి జులై 1 నుంచి ఉద్యోగులకు పెరిగిన జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈనెల 9న జరగబోయే కేబినెట్ సమావేశంలో పీఆర్సీ ఏర్పాటుతో పాటు 3 నెలల్లో నివేదిక తెప్పించుకుని జులై 1 నుంచి కొత్త పీఆర్సీ అమలయ్యేలా చర్యలు తీసుకోమని బండి సంజయ్ కోరారు. రుణమాఫీ, ఫ్రీ యూరియా, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భ్రుతి, దళిత బంధు, దళితులకు మూడెకరాలు, గిరిజన బంధు, గిరిజన రిజర్వేషన్లు, చేనేత బంధు, పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు, సొంత జాగా ఉన్నవారికి రూ. 3 లక్షల ఆర్దిక సాయం వంటి హామీలను ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదు? అని బండి సంజయ్ ప్రశ్నించారు.
మీ ప్రభుత్వానికి కొద్ది నెలల గడువు మాత్రమే మిగిలి ఉంది… అయినా హమీలను అమలు చేయకపోవడం ప్రజలను దారుణంగా వంచించడమే అని బండి సంజయ్ అన్నారు. ఈనెల 9న జరగబోయే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిపై చర్చించి తక్షణమే అమలయ్యేలా నిర్ధిష్ట కార్యాచరణ రూపొందించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆయా హామీల అమలు కోసం బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన ప్రజలతో కలిసి భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తామన్న బండి సంజయ్ జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.