100 మంది యువతను అప్పగించండి.. టీఆర్ఎస్ ను కూలుస్తా !
కందుకూరు సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, బండి సంజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మండలానికి 100 మంది యువతను నాకు అప్పగించండి, టీఆర్ఎస్ ను కూలుస్తా…. బీజేపీని అధికారంలోకి తీసుకొస్తానని అన్నారు. అధికారంలోకి వచ్చిన 15 నిమిషాల్లోనే పాతబస్తీ జల్లెడ పట్టిస్తాం…. విద్యుత్ బకాయిలను వసూలు చేయిస్తామని అన్నారు. పాతబస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేయలేకపోవడంతో వెయ్యి కోట్ల బకాయి ఉందని, పాతబస్తీలో కరెంటు బిల్లులు వసూలు చేయలేని దద్దమ్మ కేసీఆర్ అని బండి సంజయ్ విమర్శించారు. కరెంటు ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న కేసీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. కేసీఆర్ ను అడుగడుగునా అడ్డుకుని తీరుతాం…ఇదే ఆఖరి పోరాటం కావాలని అన్నారు. హిందువులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి సత్తా చూపుతామని ఆయన అన్నారు. ఓట్లు, సీట్లు కొనేందుకు సిద్ధంగా ఉన్న కేసీఆర్ రైతులు పండించిన వరి ధాన్యం మాత్రం కొనబోమని చెబుతూ రైతులను నట్టేట ముంచుతున్నాడని అన్నారు. మేం చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాం. కేంద్రం ధాన్యం కొనేందుకు డబ్బులు చెల్లించేందుకు సిద్దంగా ఉన్నా…. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మొండికేస్తూ రాజకీయం చేస్తోందని అన్నారు. కార్యకర్తలను పరామర్శించడానికి బైంసా వెళుతున్న బీజేపీ నేతలను అరెస్టు చేస్తున్న పోలీసులు… ఓవైసీ వెళితే మాత్రం స్వాగతం పలుకుతూ అడుగులకు మడుగులొత్తుతుండటం సిగ్గు చేటని అన్నారు. బైంసాలో 12 మంది కార్యకర్తల ఇండ్లను కొందరు లుచ్చాలు తగలబెడితే ఒక్క పైసా కూడా సాయం చేయని మూర్ఖపు ప్రభుత్వం కేసీఆర్ దే.. కానీ వాళ్లకు ఆర్ఎస్ఎస్ అండగా ఉంటూ ఇళ్లు కట్టించిందని అన్నారు.