Balmuri Venkat: ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పై కాంగ్రెస్ నేతల ఛార్జ్ షీట్
Balmuri Venkat: ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పై కాంగ్రెస్ నేతలు ఛార్జ్ షీట్ విడుదల చేశారు. యాత్రకు వచ్చే ఆదరణ చూడలేకే బీఆరెస్ దాడులకు పాల్పడుతోందని ఈ సందర్భంగా వారు విమర్శించారు. యూత్ కాంగ్రెస్ నేతపై దాడి, భూపాలపల్లి సభ పై దాడి వారి అరాచకానికి పరాకాష్టగా అభివర్ణించారు. మాపై దాడులు చేస్తే బీఆరెస్ నేతలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ మాట్లాడుతూ స్థానికంగా ఇసుక దోపిడీ పెరిగిపోయిందని, రేవంత్ వస్తున్నారని తెలుసుకుని డంపింగ్ పనులు ఆపేశారని అన్నారు. అనుమతులకు మించి ఇసుక తరలింపు జరుగుతుందన్న ఆయన నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని అన్నారు.
ఇక అక్రమంగా రోడ్లు వేసి మరీ ఇసుక తరలించుకు పోతున్నారని, కేటీఆర్ పర్యటన ఉండగా బీజేపీ ఎమ్మెల్యే సభకు అనుమతులు ఎలా ఇచ్చారు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలను మాత్రమే ఎందుకు అరెస్టు చేస్తున్నారని ప్రశ్నించిన ఆయన బీజేపీ, బీఆరెస్ మధ్య లోపాయకారి ఒప్పందం ఉందని అన్నారు. కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ దొరను ఓడించాలని రాజేందర్ ను గెలిపిస్తే ప్రజలకు ఒరిగిందేంటి? బీఆరెస్ అక్రమాలపై ఇప్పటి వరకు ఇక్కడి ఎమ్మెల్యే పోరాడటం లేదని, ఈటెల తన అక్రమాల్లో వాటా ఇచ్చినందుకే బీఆరెస్ లో ఆయనను అందలం ఎక్కించారని అన్నారు.
ఈటెల ఏనాడు రోడ్డెక్కి పోరాడింది లేదన్న ఆయన ఈటెల పౌరసరఫరాల మంత్రిగా ఉండగా బియ్యం స్కాంలో డబ్బులు దండుకున్నారని అన్నారు. చీకటి ఒప్పందాలు, చీకటి వ్యాపారాలు బయటపడతాయనే ఈటెల బీజేపీలో చేరారని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా స్కాంలే కానీ.. ప్రభుత్వ స్కీములు ప్రజలకు చేరడంలేదని అన్నారు. బీఆరెస్ దొంగ కౌశిక్ కు ఎమ్మెల్సీ ఇచ్చిందని, బీఆరెస్, బీజేపీ లకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.