రాజకీయాలు అంటే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అజెండాలో ఉండటం సహజం. అధికారంలోకి వస్తే చేస్తామనే పనులు.. పాలకులుగా చేసిన పనులు చెప్పుకోవడం పరిపాటి.
KCR SECULAR HINDU : తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ (congress), బీజేపీ (bjp) పార్టీలను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ (Brs) అధినేత, సీఎం కేసీఆర్ (Kcr) ముందు నుంచే వ్యూహాలు అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ సెక్యులరిజాన్ని, బీజేపీ హిందూత్వను నమ్ముకున్నాయి. మైనార్టీ మంత్రంతో హస్తం పార్టీ దేశాన్ని సుదీర్ఘకాలం పాలించింది. అందుకు దీటుగా హిందూ అజెండాతో (hindu agenda) వచ్చిన కమలనాథులు కాస్త ఆలస్యంగానైనా దేశంలో చక్రం తిప్పుతున్నారు. 10 ఏళ్లుగా కాంగ్రెస్‌కు కంటి మీద కనుకు లేకుండా చేస్తున్నారు. అయితే కేసీఆర్ ఈ రెండు పార్టీల సిద్ధాంతాలను కలిపి హిందూ సెక్యులరిజం ( SECULAR HINDU) అజెండాతో ముందుకెళ్తున్నారు. మత సామరస్యం పాటిస్తూనే హిందువులు కూడా తమ ప్రాధాన్యం అని చాటిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అటు ఆలయాలు, ఇటు మసీదులు, మరోవైపు చర్చిలకు నిధులు కేటాయిస్తున్నారు. ఇటీవల కొత్త సచివాలయంలోనూ మూడు మందిరాలను నిర్మించారు. అయితే మజ్లిస్‌తో దోస్తీ చేస్తున్న గులాబీ అధినేతపై బీజేపీ విరుచుకుపడుతోంది. కేసీఆర్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని విమర్శిస్తోంది. ఆయన ధోరణి వల్లే పాతబస్తీ ఉగ్ర అడ్డాగా మారుతోందని మండిపడుతోంది. తాము అధికారంలోకి వస్తే హిందూ అజెండాను అమలు చేస్తామని కమలనాథులు స్పష్టం చేస్తున్నారు. దీనికి బీఆర్ఎస్ నేతలు కూడా గట్టిగానే బదులిస్తున్నారు. ఇలా గులాబీ పార్టీ హిందుత్వ, మైనార్టీ ద్విముఖ వ్యూహం అమలు చేస్తూ ఓట్లకు గండి పడకుండా లౌకిక హిందూవాదాన్ని అమలు చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆలయాలకు పెద్దపీట..
తెలంగాణలో హిందూ ఆలయాలకు ప్రధాన్యం ఇస్తున్నామనేలా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. యాదాద్రి (yadadri) అభివృద్ధికి దాదాపు రూ.1000 కోట్ల వ్యయం చేశారు. ఆలయాన్ని పునర్నిర్మించారు. అలాగే భద్రాద్రి (badradri) సీతా రామచంద్రస్వామి, వేములవాడ (vemulawada) రాజరాజేశ్వర స్వామి, కొండగట్టు (kondagattu) అంజన్న ఆలయాల అభివృద్ధికి హామీ ఇచ్చారు. మాస్టర్ ప్లాన్ అమలు చేసి తీర్చి దిద్దుతామని ప్రకటించారు. తాజాగా హైదరాబాద్ కోకాపేటలో హరేకృష్ణ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న భారీ టవర్‌కు ప్రభుత్వం తరఫున స్వయంగా సీఎం కేసీఆర్ రూ.25 కోట్ల విరాళం ఇచ్చారు. కరీంనగర్లో (karimnagar) వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించేలా టీటీడీని (ttd) ఒప్పించారు. 10 ఎకరాల స్థలాన్ని ఆలయ నిర్మాణానికి కేటాయించారు. సీఎం కేసీఆర్ విజ్ఞప్తి మేరకు తెలంగాణలో శ్రీవారి ఆలయం నిర్మాణం చెస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో కరీంనగర్ పట్టణంలో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. రూ. 20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ఆలయానికి మే 31న భూమిపూజ చేస్తామని వెల్లడించారు. ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్న కేసీఆర్‌ను హరేకృష్ణ సంస్థ ఆధునిక శ్రీకృష్ణ దేవరాయలతో పోల్చింది.
జాతరలకు వైభవం..
తెలంగాణలో ప్రసిద్ధి చెందిన జాతరలు, బోనాలు (bonalu), బతుకమ్మ (bathukamma) వేడుకలను కూడా ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. రెండేళ్లకోసారి వచ్చే సమ్మక్క-సారక్క జాతర, ప్రతియేటా బోనాలు, బతుకమ్మ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుపుతోంది. ప్రభుత్వం తరఫున నిధులు కేటాయించి ఎలాంటి లోటు రాకుండా తెలంగాణ, సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీటే వేస్తోంది. తద్వారా మెజార్టీ ప్రజలకు పెద్ద పీట వేస్తామని గులాబీ పార్టీ భావనను ప్రజల్లోకి తీసుకెళ్ల గలుగుతోంది. మేడారం (medaram) జాతరను జాతీయ వేడుకగా నిర్వహించాలని కేంద్రంపైనా ఒత్తిడి చేస్తోంది. హిందూత్వ వాదం అంటే చేతల్లో ఉండాలని సవాల్ చేస్తోంది. అలాగే దూపదీప నైవేద్యాల పథకం అమలు చేస్తోంది. అర్చకులకు గౌరవ వేతనం అందిస్తోంది. హిందువుల కోసం కల్యాణ లక్ష్మీ పేరుతో ఆర్థిక సాయం చేస్తోంది. ఈ విధంగా హిందూ అజెండాను కూడా కేసీఆర్ విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మైనార్టీలకు వరాలు..
ముస్లింలు, క్రైస్తవులను కూడా ఆకట్టుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. మత సామరస్యం పాటిస్తామని ముందు నుంచి చెప్పే గులాబీ అధిపతి అదే విధంగా ఆయా వర్గాలకు కూడా వరాలు ప్రకటిస్తున్నారు. క్రిస్మస్ కానుకలు (christmas gifts) అందజేస్తున్నారు. రంజాన్ తోఫాలతో (ramadan thofa) ఆకట్టుకుంటున్నారు. ఆయా సామాజిక వర్గాల్లోని పేదవాళ్లకు పండుగ కానుకలు అందిస్తున్నారు. ఇమామ్‌లకు గౌరవ వేతనం ఇస్తున్నారు. మక్కా వేళ్లే వారికి ఆర్థికంగా సాయం చేస్తున్నారు. ఆడ పిల్లల పెళ్లిళ్లకు షాదీ ముబారక్ కింద నగదు పథకం అమలు చేస్తున్నారు. మైనార్టీల కోసం గురుకులాలు నెలకొల్పుతూ వారి ఉన్నత విద్యకు బాటలు వేస్తున్నారు.
హిందూత్వకు దీటుగానా..?
బీజేపీ నేతలు హిందుత్వ అజెండాతో విరుచుకు పడినప్పుడల్లా గులాబీ నేతలు గట్టిగానే బదులు ఇస్తున్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో చేసిన పనులను ప్రస్తావిస్తున్నారు. బీజేపీ నేతల్లా మత చిచ్చుపెట్టడం, విద్వేషాలు (Hatreds) రెచ్చగొట్టడం తమ పని కాదని మండిపడుతున్నారు. ఓట్ల కోసం మత రాజకీయాలు (vote politics) చేయబోమని స్పష్టం చేస్తున్నారు. కేసీఆర్ కూడా అనేక సందర్భాల్లో యజ్ఞాలు, యాగాలు చేశారని అంత కంటే గొప్ప హిందువు ఎవరుంటారని ఎదురుదాడికి దిగుతున్నారు. అలాగే ఆయన కుమార్తె కవిత కూడా హిందుత్వ వాదాన్ని బలంగానే వినిపిస్తున్నారు. ఇటీవల కొండగట్టులో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే కేటీఆర్ మాత్రం గుళ్లు, గోపురాల చుట్టూ తిరిగిన సందర్భాలు లేవు. దసరా వంటి వేడుకల్లో ప్రగతి భవన్‌లోని నల్ల పోచమ్మ ఆలయంలో పూజలు చేసిన సమయంలో ఆశీర్వాదం తీసుకుంటూ కనిపిస్తారు.
రెండు పార్టీలకు చెక్..?
మత రాజకీయాల విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా వ్యూహం అమలు చేస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలను ఇరుకున పడేసేలా చేస్తున్నారని.. మతం అంటే ఆలోచనలో ఉంటుందని పరమత సహనమే తమ అభిమతమని స్పష్టం చేస్తున్నారు. హిందూత్వ పార్టీ ముద్ర ఉన్న బీజేపీకి మెజార్టీ ప్రజలు ఆకర్షితులు అవకుండా చూడగలుగుతున్నారు. అటు లౌకిక వాద పార్టీ అని చెబుతున్న కాంగ్రెస్ చెంతకు మైనార్టీలు దగ్గర కాకుండా ప్రణాళిక అమలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికలకు పాతబస్తీ, హిందూత్వ అజెండాతో గట్టిగా ఢీ కొడదామని బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. హస్తం నేతలు కూడా అసలైన లౌకిక వాదులం తామే అని చాటేందుకు యత్నిస్తోంది. అయితే ఇటీవల కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బజ్రంగ్ దళ్‌ను నిషేధం విధిస్తామని ప్రకటించి ఆనక హనుమాన్ (Hanuman) జపం అందుకోవాల్సి వచ్చింది. మరి తెలంగాణలో కాంగ్రెస్ ఎలాంటి అంశాలు తెరపైకి తెస్తుందనేది తేలాల్సి ఉంది.
విమర్శలు ఏంటి..?
బీఆర్ఎస్ (Brs) ప్రభుత్వం చేపట్టిన ఆలయాల అభివృద్ధి అజెండాపైనా విమర్శలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ (real estate) దందాలో భాగంగానే ప్రధాన ఆలయాలకు నిధులు కేటాయించారనే ఆరోపణలు అనేకం. ఆయా ప్రాంతాల్లో గులాబీ నాయకులు ముందే భూములు కొనుగోలు చేసి అభివృద్ధి పేరుతో వందల కోట్లు పోగేసుకుంటున్నారనే విమర్శలకే తక్కువలేదు. యాదాద్రిలో ఇలాగే వేల కోట్లు సంపాదించారని.. మిగతా ఆలయాల దగ్గర కూడా ఇదే ప్రణాళిక అమలు చేస్తున్నారనే రాజకీయ విమర్శలు ఉన్నాయి. దీనికి గులాబీ నేతలు కూడా గట్టిగానే బదులిస్తున్నారు. హిందూ వాదులం అని చెప్పుకునే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలోని ఆలయాలా అభివృద్ధికి ఎందుకు నిధులు ఇవ్వదని ప్రశ్నిస్తున్నారు. యాదాద్రి ఆలయానికి ఒక్క రూపాయి అయినా కేటాయించారా అని నిలదీస్తున్నారు. ఇటీవలే మంత్రి తలసాని ఒంటికాలుపై లేచారు. బండి సంజయ్‌ను (Bandi Sanjay) వాడు వీడు అని సంబోధించారు. బొట్టు పెట్టుకోవడం కూడా నేర్పిస్తాడట? అని తీవ్రంగా స్పందించారు. ఏదేమైనా రానున్న ఎన్నికల్లో హిందూత్వ, లౌకిక వాద, హిందూ లౌకిక వాద అజెండాల మధ్య పోరులో జనం ఎవర్ని ఆదరిస్తారనే ఉత్కంఠ నెలకొంది.