Khammam BRS Meeting: చరిత్రలో నిలిచిపోయేలా బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభ
Khammam BRS Meeting: భారత రాష్ట్ర సమితిగా రూపుదిద్దుకున్న అనంతరం నిర్వహిస్తున్న ఆవిర్భావ సభకు ఖమ్మం వేదికవుతోంది. బుధవారం జరిగే భారీ బహిరంగ సభ నేపథ్యంలో ఖమ్మం గులాబీ గుమ్మంగా మారింది. ఖమ్మంలో జరిగే ఈ సభ.. దేశ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెసేతర.. లౌకిక కూటమికి వేదిక కాబోంతోందని నేతలు పేర్కొంటున్నారు. ఈ బాధ్యతలను మంత్రి హరీష్ రావు కి అప్పచెప్పాడు కేసీఆర్. దాదాపు పది రోజులనుండి హరీష్ రావు ఖమ్మం పట్టణంలోనే ఉంటూ పనులను సమీక్షిస్తున్నారు ఇప్పటికే ఖమ్మం నగరం పార్టీ హోర్డింగులు, కటౌట్లతో గులాబీమయమయింది. తొలి సభ కావడంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 100 ఎకరాల్లో సభ, 400 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. 15 వేల మంది వీఐపీలకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
ఖమ్మం జిల్లాలోని ప్రధాన రహదారులు, జిల్లా సరిహద్దులు, సభాప్రాంగణంతో పాటు నగరమంతా స్వాగత బ్యానర్లు, తోరణాలు, జెండాలతో గులాబీమయంగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర రాష్టాల సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్‌మాన్, పినరయ్ విజయన్, యూపీ మాజీ సీఎంఅఖిలేష్ యాదవ్‌తో పాటు పలు జాతీయ, ప్రాంతీయ పార్టీలు, సంఘాల నేతలు ఖమ్మం సభకు హాజరవుతున్నారు. ఈరోజు సాయంత్రానికి పలువురు నేతలు హైదరాబాద్ కి చేరుకుంటారు. పలువురు ఐపీఎస్‌లు, ఐజీ ర్యాంక్ అధికారులకు ఖమ్మం మీటింగ్ కోసం డ్యూటీలు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి సుమారు 4,200మంది సిబ్బందిని బందోబస్తు కోసం తరలిస్తున్నారు. ఖమ్మం నుంచి వైరా వెళ్లే రోడ్డులో కొత్త కలెక్టరేట్ వెనకాల సభాస్థలి ఉండగా, ముందు వరుసలో ఏకంగా 5 వేల మంది కూర్చునేందుకు వీలుగా సోఫాలు ఏర్పాటు చేస్తున్నారు.
మొదటి సారి జరుగుతున్న బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభ కావడంవల్ల యావత్ దేశ దృష్టిని ఆకర్షించి చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని పార్టీ పెద్దలు పేర్కొనడంతో దాదాపుగా 5లక్షల మందితో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రేటర్ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ, సభితా ఇంద్రారెడ్డి భారీగా జన సమీకరణకు ప్లాన్ చేశారు.