తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. ఏకంగా 115 మంది అభ్యర్థులతో జాబితాను రిలీజ్ చేశారు. ఐతే.. క్షేత్రస్థాయిలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాలో ఉన్నవారిలో ఆందోళన మొదలైంది.
Telangana Elections : తెలంగాణలో ఎన్నికలకు(Telangana elections) సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్(CM KCR) స్పీడ్ పెంచారు. ఏకంగా 115 మంది అభ్యర్థులతో జాబితాను రిలీజ్ చేశారు. ఐతే.. క్షేత్రస్థాయిలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాలో(List of BRS Candidates) ఉన్నవారిలో ఆందోళన మొదలైంది. పార్టీ అభ్యర్థిగా ఒకరిని ప్రకటిస్తే.. నియోజకవర్గంలో మరొకరు.. తనకే టికెట్ వస్తుందంటూ ప్రచారం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. చాలా నియోజకవర్గాల్లో ఇలా జరుగుతోందని, దీంతో అధినేత కేసీఆర్ చెప్పినట్లు ఒకటి, రెండు చోట్ల కాకుండా.. 20 మంది వరకు అభ్యర్థుల మార్పు జరగవచ్చని బీఆర్‌ఎస్‌లో(BRS) అంతర్గతంగా చర్చ నడుస్తోంది. అలాంటప్పుడు ‘వీళ్లకే టికెట్లు’ అని ప్రకటించడం ఎందుకన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అయితే సిటింగ్‌లకు పెద్ద సంఖ్యలో టికెట్లు ప్రకటించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని, కేసీఆర్ ప్రకటించిన జాబితా నామమాత్రమైందేనన్న కొత్త చర్చ తాజాగా తెరపైకి వచ్చింది. బీఫామ్‌లు ఇచ్చేనాటికి ఎవరి పేర్లు ఫైనల్ జాబితాలో(Final list) ఉంటాయో..? ఎవరు ఎటు వెళ్తారోనన్న అంశం ఇపుడు బీఆర్‌ఎస్‌లో ‘టాక్ ఆఫ్ ద సీట్’గా మారింది. అభ్యర్థుల జాబితా ప్రకటించిన రోజే.. సర్వేలు ఇంకా జరుగుతున్నాయని, ఫైనల్ సర్వే ఆధారంగా మరోసారి అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్న సంకేతాలను సీఎం ఇచ్చారు. జాబితా ప్రకటించే నాటికే కొందరు సిటింగ్ ఎమ్మెల్యేలపై క్షేత్రస్థాయిలో అసంతృప్తి ఉందనే సమాచారం కేసీఆర్ వద్ద ఉంది. అంతేకాకుండా దళితబంధులో ఎమ్మెల్యేలు, వారి అనుచరులు కమీషన్ల పర్వానికి తెరలేపడం, అది కాస్తా అధినేత దృష్టికెళ్లడంతో తీరు మార్చుకోకుంటే వేటు తప్పదంటూ స్వయంగా అధినేతే పార్టీ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా.. వారికే టికెట్ ఇవ్వడంతో కేవలం ఇది సిటింగ్‌ల ‘కట్టడి’ జాబితానే అన్న అభిప్రాయం బలపడుతోంది.
ప్రస్తుతం ఉన్న బీఆర్‌ఎస్ సిటింగ్ ఎమ్మెల్యేల్లో ఆ పార్టీ తరఫున గెలిచినవారే కాకుండా.. ఇతర పార్టీల్లో గెలిచి అధికార పార్టీలో చేరినవారూ ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలకు తోడు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు కూడా టికెట్ ఆశించడంతో ఎవరికి ఇవ్వాలన్నది పార్టీకి తలకు మించిన భారంగా మారింది. ప్రతిపక్ష పార్టీలు పలువురు బీఆర్‌ఎస్ సిటింగ్‌లపై గురి పెట్టడం, వారికి టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో.. ఎవరికి టికెట్ ఇవ్వాలి..? ఎవరిని ఫైనల్ చేయాలి..? మిగతా వారికి ఏ పదవిని హామీగా ఇవ్వాలి..? అనే విషయాలపై బీఆర్‌ఎస్ అధిష్ఠానం మల్లగుల్లాలు పడాల్సి వచ్చింది.
అసమ్మతులు, అసంతృప్తితో ఉన్నవారు పార్టీ మారినా పెద్దగా నష్టమేమీ ఉండదని, కానీ.. సిటింగ్ ఎమ్మెల్యేలు టికెట్ దక్కలేదనే కారణంతో పార్టీ మారితే మాత్రం తీవ్ర నష్టం వాటిల్లుతుందని బీఆర్‌ఎస్ అధినేత భావించినట్లు తెలుస్తోంది. వారు గోడ దూకకుండా కట్టడి చేసేందుకే ముందస్తు జాబితా పేరుతో మొదటగా సిట్టింగ్‌లకే టికెట్ కేటాయించారని పార్టీలో చర్చ నడుస్తోంది. కానీ, ఎన్నికల నాటికి ఈ జాబితాలో చాలా మార్పులుంటాయని, కీలకమైన స్థానాల్లో కూడా అభ్యర్థులు మారతారనే అభిప్రాయాలు ఆ పార్టీ ముఖ్యుల్లోనే వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో వ్యతిరేకత ఎదుర్కొంటున్న వారితోపాటు, తుది సర్వే పూర్తయ్యే నాటికి ఏర్పడే పరిస్థితుల నేపథ్యంలో చివరి నిమిషానికి 20 మందికి పైగా అభ్యర్థులు జాబితా నుంచి ఔట్ అవుతారనే ప్రచారం సాగుతోంది. దీంతో ప్రస్తుతం జాబితాలో చోటు దక్కిన అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. ఈ కారణంగానే చాలా మంది క్షేత్రస్థాయికి కూడా వెళ్లడంలేదని సమాచారం.
అభ్యర్థుల జాబితా ప్రకటించినప్పటి నుంచి ఎక్కడా అసమ్మతి, అసంతృప్తి లేదని బీఆర్‌ఎస్ నేతలు(BRS Candidates) చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. పలు నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలు తమ అనుచరులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తుండడం జరుగుతూనే ఉంది. కొన్ని స్థానాల్లో అసమ్మతి కట్టలు తెంచుకుంటోంది. ఇలా రోజురోజుకూ చాప కింద నీరులా విస్తరిస్తున్న అసంతృప్తులను కట్టడి చేయడం అభ్యర్థులకు తలకు మించిన భారంగా మారిందనే చర్చ జరుగుతోంది. అయితే ప్రస్తుత జాబితాలో టికెట్ పొందిన అభ్యర్థులే తమ పరిధిలోని అసంతృప్తులకు సర్ది చెప్పుకోవాలని, ఎన్నికల నాటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవాలని అధిష్ఠానం సూచించింది. దీంతో తమను అభ్యర్థులుగా ప్రకటించడం మాటేమోగానీ.. అసంతృప్తులను బుజ్జగించలేక ప్రాణం పోతోందంటూ ఎమ్మెల్యేలు ఒకరికొకరు చెవులు కొరుక్కుంటున్నారు. ఇంతా చేసినా.. తుది సర్వేల పేరుతో చివరికి తమకు టికెట్ ఇస్తారో, లేదోనన్న ఆందోళన వారిలో నెలకొంది. దీంతో కేసీఆర్ చెప్పేదొకటి.. చేసేదొకటన్న చర్చ మొదలైంది. అభ్యర్థుల మార్పు ఉంటుందన్న చర్చకు ఈ అంశం కూడా బలం చేకూరుస్తోందని అంటున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అమెరికా టూర్‌లో ఉన్నారు. ఆయన వచ్చాక కూడా జాబితాలో మార్పులు-చేర్పులు ఉంటాయనే టాక్ నడుస్తోంది. దీంతో బీఆర్‌ఎస్ నుంచి బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరో తెలుసుకోవాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదు.