Vande Bharat Train: వందే భారత్ ఎక్స్ ప్రెస్ టైంటేబుల్… టికెట్ రేట్ల వివరాలివే!
AP-TG Vande Bharat Train Schedule: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు రేపు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ రద్దీ వేళ ప్రయాణీకులకు గుడ్ న్యూస్ చెప్పింది రైల్వే శాఖ. వందే భారత్ రైలు టికెట్ బుకింగ్లు ప్రారంభమయ్యాయి. ఈనెల 16 నుంచి విశాఖ- సికింద్రాబాద్ మధ్య వందే భారత్ ట్రైన్ నడవనుంది. ఇప్పటికే దేశంలో ఏడు వందే భారత్ రైళ్లు ప్రారంభమవగా ఇప్పుడు విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య ప్రారంభం కానున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు 8వది. బుల్లెట్ ట్రైన్ తరహాలో ముందుభాగం, బయటి దృశ్యాలు వీక్షించేందుకు వీలుగా ఫుల్ గ్లాస్ సెట్టింగ్ ప్రత్యేకతలు కాగా రైలు గరిష్ట వేగం గంటకు 160 కిలోమీటర్లు కాగా 140 సెకన్లలోనే ఆ వేగం అందుకోగలదు. ట్రాక్ సామర్ధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అంత వేగం అయితే ప్రయాణించే అవకాశం లేదు.
ఈ రైలులో 14 ఏసీ ఛైర్ కార్లు, 2 ఎగ్జిక్యూటివ్ ఏసీ ఛైర్ కార్ కోచ్‌లు ఉండగా మొత్తం 1128 మంది ప్రయాణీకులకు అవకాశముంటుంది. విశాఖపట్నం నుంచి నెంబర్ 20833తో ఈ రైలు ప్రతిరోజు ఉదయం 5.55 గంటలకు ప్రారంభమై..మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. విశాఖపట్నం నుంచి రాజమండ్రికి 7.55 గంటలకు, విజయవాడకు 10 గంటలకు, ఖమ్మం 11 గంటలకు, వరంగల్ 12.05 గంటలకు చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై..రాత్రి 11.30 గంటలకు విశాఖపట్నం చేరుకోనుంది ఈ వందే భారత్ రైలు. వరంగల్‌కు మద్యాహ్నం 4.35 గంటలకు, ఖమ్మం మద్యాహ్నం 5.07 గంటలకు, విజయవాడ సాయంత్రం 7 గంటలకు, రాజమండ్రికి 8.50 గంటలకు చేరుకోనుంది. ఇక వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు చెయిర్‌కార్ ఛార్జి కేటరింగ్, ఇతర పన్నులతో కలిపి 1720 రూపాయలు కాగా ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధర 3170 రూపాయలుగా నిర్ణయించారు.