తెలంగాణ రాష్ట్రంలో మరో భారీ పరిశ్రమ
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. పలు పరిశ్రమల యాజమాన్యాలతో చర్చించిన కేటీఆర్.. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించాలని, పరిశ్రమకు తగిన వసతులు కల్పిస్తామన్నారు. ఈ మేరకు కేటీఆర్ చర్చలతో ప్రపంచంలోనే తిలాపియ చేపలను ఎగుమతి చేసే ఫిష్ ఇన్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.
రాష్ట్రంలో 1000 కోట్ల రూపాయలతో పూర్తిస్థాయి ఇంటిగ్రేటెడ్ ఫ్రెష్ వాటర్ ఫిష్ కల్చర్ వ్యవస్థను డెవలప్ చేయనున్నట్లు కంపెనీ సీఈవో మనీష్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఫిష్ ఇన్ కంపెనీ తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు రిజర్వాయర్ వద్ద కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభిచనున్నట్లు తెలుస్తుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అక్కడ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఫిష్ ఇన్ కంపెనీ చేపల ఉత్పత్తిలో హ్యచరీలు, దాణా తయారీ, కేజ్ కల్చర్, ఫిష్ ప్రాసెసింగ్‌తో పాటు ఎగుమతుల వంటి అనేక విభాగాల్లో కార్యకలాపాలు కొనసాగించనుంది.