Amit Shah : తెలంగాణపై అమిత్ షా ప్రత్యేక దృష్టి
Amit Shah : తెలంగాణపై అమిత్ షా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ ఏడాది తెలంగాణలో జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో గెలిచి తీరాల్సిందేనని కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ బీజేపీ నాయకులకు స్పష్టం చేశారు. నేతలంతా గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని రాష్ట్ర ముఖ్యనేతలకు దిశా నిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో అమిత్ షా తెలంగాణకు రానున్నారు. మార్చి 11న హైదరాబాద్ కు రానున్న ఆయన. 12న హకీంపేటలో అధికారిక కార్యక్రమంలో పాల్గొనున్నారు. పర్యటనలో భాగంగా రాష్ట్ర పార్టీ కోర్ కమిటీతో భేటీ కానున్నారు.
ఇక.. ఇదే నెలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలు రాష్ట్రానికి రానున్నట్లు సమాచారం. మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ లో పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారని తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల బాధ్యతలు అమిత్ షా తన భుజాన వేసుకున్నారని తెలుస్తుంది. బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర విజయవంతం కావడంతో ఆరో విడత యాత్రకు సిద్ధమవుతున్న తరుణంలో.. ముందస్తు ఎన్నికలు వస్తాయనే ఊహాగానాలతో వాటి స్థానంలో రథయాత్రలకు బీజేపీ శ్రీకారం చుడుతోంది.
రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ పై వ్యతిరేకత ఉందని బీజేపీకి అవకాశాలు పెరుగుతున్నాయని వాటిని అందిపుచ్చుకునేందుకు నేతలంతా ఐక్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. బీజేపీ కార్యకర్తలు,బీజేపీ నాయకులు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ఇకపై తన దృష్టి అంతా తెలంగాణ పై ఉంటుందని, తెలంగాణలో బీజేపీ గెలుపే లక్ష్యంగా నాయకులంతా ముందుకు సాగాలని తెలిపారు .