TPCC New Committee: తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త టీం – కోమటిరెడ్డికి జలక్
AICC Appointed New Team Committees for TPCC: ఎట్టకేలకు తెలంగాణ కాంగ్రెస్ పైన పార్టీ అధినాయకత్వం కదిలింది.ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న కమిటీల పునర్వ్యవస్థీకరణతో పాటుగా జిల్లాల అధ్యక్షులను మార్చుతూ నిర్ణయం తీసుకుంది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ బాధ్యతలు తీసుకున్న తరువాత సీనియర్ల నుంచి పూర్తి స్థాయి సహకారం అందలేదు. పలువురు నేతలు పార్టీ వీడారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీపీసీసీ కొత్త కమిటీలు ఏర్పాటు చేయాలని రేవంత్ పార్టీ అధినాయకత్వాన్ని కోరారు. ఈ సమయంలో సీనియర్లతో చర్చల తరువాత కమిటీల్లోకి సూచిస్తూ పలువురి పేర్లు సూచించారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే బాధ్యతల స్వీకరణతో కొత్త కమిటీల ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. అయితే, ఈ కమిటీల్లో ఎక్కడా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అవకాశం దక్కలేదు.
తెలంగాణ కాంగ్రెస్ కమిటీలో భాగంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నలుగురిని ఎంపిక చేసారు. అందులో అజారుద్దీన్ అంజన్ కుమార్ యాదవ్, మహేష్ గౌడ్, జగ్గారెడ్డి కొనసాగుతారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ ను మూడు విభాగాలుగా ఏఐసీసీ విభజించింది. కొత్తగా జిల్లాల అధ్యక్షులను ఎంపిక చేసారు. ఏఐసీసీ 18 మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ప్రకటించింది. ఆ కమిటీకి ఛైర్మన్ గా మాజీ రాష్ట్ర ఇంచార్జ్ మానిక్కమ్ ఠాగూర్ వ్యవహరించనున్నారు. అదే విధంగా సభ్యులుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ తో పాటుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేత వీహెచ్, పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల, ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవకాశం ఇచ్చారు.
సీనియర్ నేతలు గీతారెడ్డి, జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ, దామోదర్ రాజనర్సింహ, రేణుకా చౌదరి, బలరాం నాయక్, మధుయాష్కీ, చిన్నారెడ్డి, శ్రీధర్ బాబు ,వంశీ చందర్ రెడ్డి, సంపత్ కుమార్ ను ఈ కమిటీలో సభ్యులుగా నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. 26 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ ఏఐసీసీ ప్రకటన చేసింది. దీంతో, రేవంత్ – మాణికం ఠాగూర్ కోరుకున్నట్లుగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిన పక్కన పెట్టారు. ఆయనకు ఎటువంటి పోస్టు ఇవ్వలేదు. దీంతో పాటుగా సీనియర్లతో ఒక రాష్ట్ర కార్యవర్గ కమిటీని ప్రకటించారు. రేవంత్ జంబో టీం సిద్దం కావటంతో, ఇదే రేవంత్ ఎన్నికల టీం కానుంది.