Agnipath-Revanth: ఆర్మీవాళ్లను అడ్డా మీద కూలీల్లా చెయ్యొద్దు
Revanth Reddy fires on PM Modi: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రధాని మోడీపై ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘అగ్నిపథ్’ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ పథకం ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదని, హడావుడిగా అమలుచేస్తున్న అతిపెద్ద పొరపాటని విమర్శించారు. దీని ద్వారా ప్రధాని మోడీ ఆర్మీవాళ్లను అడ్డా కూలీలుగా మార్చబోతున్నారని మండిపడ్డారు.
చట్టాలను, శాసనాలను పక్కనపెట్టి ఇలా ఇష్టమొచ్చినట్లు సైనికులను స్వల్ప కాల (నాలుగేండ్ల) సర్వీసులోకి తీసుకోవటం, పెన్షన్ లేకుండా చేయటమేంటని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నియామక విధానాల ప్రకారం జవాన్లకు 17 ఏళ్ల సర్వీసులో రెండేళ్ల కఠిన శిక్షణ ఇస్తున్నారని, ‘అగ్నిపథ్’తో ఆర్మీలోకి వచ్చేవాళ్లు 6 నెలల్లో ఏం నేర్చుకుంటారని నిలదీశారు.
ప్రధాని మోడీ అనాలోచిత నిర్ణయాల వల్ల దేశ భద్రత ప్రమాదంలో పడబోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్మీలో రెండు లక్షల ఖాళీలు ఉండగా ఏటా 70 వేల మందిని మాత్రమే రిక్రూట్ చేసుకోవటం సరికాదని రేవంత్ రెడ్డి చెప్పారు. ‘అగ్నిపథ్’ని విరమించుకోవాలని, ఇప్పటికే రెండు పరీక్షలు ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రాత పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
రైల్వే స్టేషన్ లో చాయ్ అమ్మి ప్రధాని అయినట్లు గొప్పగా చెప్పుకోవద్దని హితవు పలికారు. తాము తలచుకుంటే చాయ్ అమ్మే వ్యక్తినీ ప్రధానిని చేయగలమని ప్రజలు నిరూపించటాన్ని మర్చిపోవద్దని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని హెచ్చరించారు.