టాలీవుడ్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు వేగవంతం
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఎక్సైజ్ అఫిడవిట్ కాపీలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. 800 పేజీలతో తెలంగాణ హైకోర్టుకు నివేదిక ఇచ్చారు అధికారులు. 12 కేసుల ఎఫ్‌ఐఆర్‌లు, ఛార్జిషీట్లతో పాటు నిందితుల, సాక్ష్యుల వివరాలు సేకరించారు.
మరోవైపు నిందితులు, సినీతారలకు చెందిన 600 GB వీడియో రికార్డులను కోర్టుకు అందజేశారు. దీంతో పాటు 10 ఆడియో క్లిప్స్, కాల్ డేటాలను, సాక్ష్యాలను హై కోర్టు ఈడీకి అందజేసింది. తెలంగాణలో నాలుగేళ్ల క్రితం సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎక్సైజ్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ తర్వాత ఎటూ తేలని ఈ కేసులో.. ఈడీ మరోసారి విచారణ చేపట్టబోతుంది. ఎక్సైజ్ శాఖ ఈడీకి కీలక అధారాలు అందజేసింది. డిజిటల్ రికార్డ్స్, కాల్ డేటా, ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికలను అందజేసింది. గతంలో విచారణ వివరాలు ఇవ్వాలని ఈడీ కోరినా.. ఎక్సైజ్ శాఖ పట్టించుకోలేదు. కోర్టు జోక్యంతో దిగొచ్చిన ఎక్సైజ్ శాఖ ఈడీకి వివరాలు అందజేసింది