పెళ్లి అయి ఇద్దరు పిల్లు ఉన్న వివాహిత.. ఓ యువకుడికి వల వేసింది. అతని వద్ద నుంచి లక్షల రూపాయలు దోచుకుంది. ఆ తర్వాత ఎదురు దాడికి దిగింది.
Crime: ఆమె పేరు స్వాతి. పెళ్లి అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ డబ్బు కోసం ఓ యువకుడికి వల వేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించింది. అతని వద్ద నుంచి లక్షల రూపాయలు తీసుకుంది. చివరికి పెళ్లి చేసుకోవాలని యువకుడు ఒత్తిడి తీసుకురావడంతో ఎదురు దాడికి దిగింది. తనను వేధిస్తున్నావని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. ఈ మోసంలో ఆ యువతి భర్త, ఇద్దరు పిల్లల ప్రమేయం కూడా ఉండడం ఆశ్చర్యకరమైన విషయం.
నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన ఓ యువకుడు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కొద్దిరోజులుగా పెళ్లి చేసుకోవాలని సంబంధాల కోసం చూశాడు. కానీ ఒక్కసంబంధం కూడా రాకపోవడంతో చివరికి మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకున్నాడు. కొద్దిరోజులకు ఆ యువకుడికి మ్యాట్రిమోనీ సైట్‌లో వైజాగ్‌కు చెందిన స్వాతి అనే యువతితో పరిచయం ఏర్పడింది. అప్పటికే స్వాతికి పెళ్లి అయి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
కానీ ఈ విషయాన్ని చెప్పకుండా.. స్వాతి యువకుడితో పరిచయం పెంచుకుంది. ఇద్దరూ ఫోన్లు, వీడియో కాల్స్ కూడా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కొద్దిరోజులకు స్వాతి.. ఆ యువకుడికి ఫోన్ చేసి తనకు యాక్సిడెంట్ అయిందని చెప్పింది. పరిస్థితి క్రిటికల్‌గా ఉందని.. హాస్పిటల్ ఖర్చులకు డబ్బులు పంపించాలని కోరింది. వెంటనే ఆ యువకుడు డబ్బులు పంపించాడు.
అలా స్వాతి ఏడాది పాటు.. యువకుడి నుంచి రూ. 4 లక్షల వరకు వసూల్ చేసింది. ఇటీవల యువకుడు పెళ్లి చేసుకోవాలని స్వాతిపై ఒత్తిడి తీసుకొచ్చాడు. స్వాతి కొంచెం సమయం కావాలని అడిగినా.. యువకుడు ఒప్పుకోలేదు. దీంతో ఎదురు దాడికి దిగిన స్వాతి.. తనను వేధిస్తున్నావని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని యువకుడిని బెదిరించింది. దీంతో తాను మోసపోయానని గుర్తించిని యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేయగా.. షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. స్వాతి, తన భర్త, కూతుళ్లతో కలిసే ఈ మోసానికి పాల్పడిందని తేలింది. స్నేహితులని చెప్పి యువకుడితో తన కూతుళ్లతోనే మాట్లాడించిందని పోలీసులు గుర్తించారు. దీంతో స్వాతితో పాటు ఆమె భర్త, కూతుళ్లపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.