Telangana: తెలంగాణలో కొత్తగా 13 మండలాలు.. ఏ జిల్లాలో ఎన్ని మండలాలంటే ?
Telangana Government Has Taken Crucial Decision: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నారాయణ పేట జిల్లాలో గుండుమల్, కొత్తపల్లెను నూతన మండలాలుగా ప్రకటించిన ప్రభుత్వం.. వికారాబాద్ జిల్లా తాండూర్ రెవిన్యూ డివిజన్ పరిధిలోని దుడ్యాల్ను మండల కేంద్రంగా ఏర్పాటు చేసింది. దీంతో పాటు మహబూబ్ నగర్ జిల్లా రెవిన్యూ డివిజన్ పరిధిలోని కౌకుంట్ల, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రెవిన్యూ డివిజన్ పరిధిలోని ఆలూర్, డొంకేశ్వర్తో పాటు బోధన్ రెవిన్యూ డివిజన్లోని సాలూరును నూతన మండలంగా ఏర్పాటు చేసింది.
మరోవైపు మహబూబాబాద్ జిల్లా రెవిన్యూ డివిజన్ పరిధిలోని సిరోల్ను మండల కేంద్రంగా ప్రకటించింది ప్రభుత్వం. దీంతో పాటు నల్లగొండ జిల్లా రెవిన్యూ డివిజన్లోని గట్టుప్పల్, సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ రెవిన్యూ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ను, జగిత్యాల రెవిన్యూ డివిజన్ పరిధిలో గల ఎండపల్లి, కోరుట్ల డివిన్లోని భీమారం, కామారెడ్డి జిల్లా బాన్స్వాడ రెవిన్యూ డివిజన్ పరిధిలోని డోంగ్లిని నూతన మండలాలుగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాష్ట్రంలో కొత్తగా 13 మండలాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
కాగా మునుగోడు నియోజకవర్గంలో గట్టుప్పల్ మండలం ఏర్పాటు చేయాలని స్థానికులు చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఐతే. ఆ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజీపీలో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఖామమనే వార్తలు వస్తుండటంతో అక్కడ ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు సైతం ఉన్నాయంటూ సోషల్ మీడియాలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అప్రమత్తమైన సీఎం కేసీఆర్ మునుగోడుపై ఫోకస్ పెంచారు. మంత్రి జగదీశ్ రెడ్డితో ఈ విషయంపై చర్చలు జరిపారు. ఇందులో భాగంగానే గట్టుప్పల్ను మండల కేంద్రంగా ప్రకటించినట్లు సమాచారం.