మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో పలు అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.
KTR AT AMERICA : టెక్నాలజీ (Technology) రంగంలో సేవలందించడంలో దిగ్గజ సంస్థగా పేరుగాంచిన బైన్ క్యాపిటల్‌కు చెందిన వీఎక్స్ఐ గ్లోబల్ (VXI GLOBEL) సొల్యూషన్స్ హైదరాబాద్ (Hyderabad)లో తమ డెలివరీ సెంటర్ (Delivery Center)ను ఏర్పాటు చేయనున్నది. ఇందులో దశలవారీగా 10 వేల మంది నిపుణులకు ఉద్యోగాలు కల్పించనున్నారు. మొదటి మూడేళ్లలో 5000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్టు సంస్థ వర్గాలు తెలిపాయి. అమెరికా(America) పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వీఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్స్ గ్లోబల్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ ఎరికా బోగర్‌కింగ్ హ్యూస్టన్‌లో సమావేశమయ్యారు. తమ సంస్థకు చెందిన డెలవరీ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటుచేస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. తొమ్మిదేండ్ల స్వల్పకాలంలోనే పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ ఎలా మారిందో ఎరికా బోగర్కింగ్కు మంత్రి కేటీఆర్ వివరించారు. ప్రగతిశీల విధానాలు, అద్భుత మౌలిక సదుపాయాలు, నైపుణ్యంగల శ్రామికశక్తి తెలంగాణలో ఉన్నందునే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ దార్శనికతతో నేడు తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అద్భుత పురోగతి సాధించిందని పేర్కొన్నారు. గత ఏడాది దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమలో 4.50 లక్షల ఉద్యోగాలు ఏర్పడితే, అందులో 1.5 లక్షల ఉద్యోగాలు హైదరాబాద్‌లోనే వచ్చినట్టు తెలిపారు.
తరలి వస్తోన్న పరిశ్రమలు
డెలివరీ సెంటర్ ఏర్పాటుచేయాలన్న వీఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్స్ నిర్ణయంతో టెక్ కంపెనీల గమ్యస్థానం హైదరాబాదే అన్న సంగతి మరోసారి స్పష్టమైందని అన్నారు. మాండీ హోల్డింగ్స్, స్టోరబుల్, రైట్ సాఫ్ట్వేర్, చార్లెస్ స్వాబ్ కార్పొరేషన్, రేవ్ గేర్స్, టెక్జెన్ తదితర సంస్థ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు . హైదరాబాద్‌లో డైనమిక్ బిజినెస్ ఎకో సిస్టమ్ ఉన్న కారణంగానే తాము అక్కడ డెలివరీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని వీఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్స్ తెలిపింది. మొదటి మూడేండ్లలో ఐదువేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించింది. హైదరాబాద్ అభివృద్ధిలో ఈ గ్లోబల్ సెంటర్ తనవంతు పాత్ర పోషిస్తుందని పేర్కొన్నది. వీఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్స్‌ను 1998లో స్థాపించారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం అమెరికా కాలిఫోర్నియాలోని లాస్ఏంజెల్స్లో ఉన్నది. ఈ సంస్థ ఉత్తర అమెరికా, ఆసియా, యూరప్, కరేబియన్‌లోని 42కిపైగా ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. ఇందులో ప్రస్తుతం 40 వేలకుపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ సంస్థ ప్రపంచంలోని ప్రముఖ బ్రాండ్లకు కస్టమర్ కేర్, కస్టమర్ సొల్యూషన్స్ సేవలు అందించటంతోపాటు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, క్వాలిటీ అష్యూరెన్స్, ఆటోమేషన్ తదితర విభాగాల్లో సేవలందిస్తున్నది.