Twitter Update: భారీగా పెరగనున్న ట్వీట్ సైజ్. ఏకంగా ‘నోట్స్’ రాసుకోవచ్చు
Twitter testing character limit increase for a post: సామాజిక మాద్యమం ట్విట్టర్‌లో భారీ మార్పు చోటుచేసుకోబోతోంది. యూజర్లకు త్వరలో సరికొత్త అప్డేట్ వస్తోంది. దీని ప్రకారం ఇకపై ఒక ట్వీట్‌లో 2,500 అక్షరాల వరకు కంపోజ్ చేసుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. ఇన్నాళ్లూ ఈ లిమిట్ 280 అక్షరాలు మాత్రమే కావటం గమనార్హం. ఈ పరిమితిని 280 నుంచి ఏకంగా 2,500కు పెంచాలని ట్విట్టర్ అనుకుంటోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది.
ఇప్పటికే అమెరికా, యూకే, కెనడా, ఘనా వంటి దేశాల్లో చిన్న చిన్న గ్రూపుల్లో ప్రయోగాత్మకంగా అమలవుతోంది. మొదట్లో ఒక ట్వీట్ క్యారెక్టర్ల పరిమితి కేవలం 140. దీన్ని 2017 తర్వాత 280కి పెంచారు. ఇప్పుడు 2,500కి పెరగబోతోంది. ఈ కొత్త ఫీచర్ ని ‘నోట్స్’ అని అంటారు. దీని సాయంతో ఎస్సే(వ్యాసం) మాదిరి పెద్ద పెద్ద రైటప్ లను ఒక లింక్ రూపంలో షేర్ చేసుకోవచ్చు. ఈ మైక్రో బ్లాగింగ్ సైట్ ఆన్ లో ఉన్నా ఆఫ్ లో ఉన్నా ఈ ఫీచర్ ని వాడుకోవచ్చు.
కొత్త అప్డేట్ అందుబాటులోకి వచ్చాక 2500 పదాల కంటెంట్ తోపాటు ఫొటోలు, వీడియోలు, జిఫ్ లతో కూడిన భారీ సైజ్ పోస్టులను రాసుకోవచ్చు, పబ్లిష్ చేయొచ్చు, షేర్ కూడా చేసుకోవచ్చు. ‘నోట్స్’కి సంబంధించిన నోట్ కార్డు ట్విట్టర్ టైమ్ లైన్ లో ఒక ట్వీట్ లాగా కనిపిస్తుంది. ‘నోట్స్’కి ప్రత్యేకమైన యూఆర్ఎల్స్ ఉంటాయి. కాబట్టి ట్విట్టర్ లో లాగిన్ అయినా కాకపోయినా అసలు ట్విట్టర్ అకౌంటే లేకపోయినా కూడా వాడుకోవచ్చు.