Telephone companies on True Caller Feature: ట్రూకాలర్ పీచర్‌ను వ్యతిరేకిస్తున్న టెలికాం సంస్థలు… గోప్యతకు భంగం కలుగుతుందని వాదన
Telephone companies on True Caller Feature: ఎవరు మనకు కాల్ చేశారో తెలుసుకోవాలంటే ట్రూకాలర్ యాప్‌ను ఓపెన్ చేసుకోవాలి. అయితే, ఇది థర్డ్ పార్టీ యాప్ కావడంతో వ్యక్తిగతంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. దీనికోసమే ట్రాయ్ సంస్థ నేమ్ కాలింగ్ ప్రజెంటేషన్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేమ్ కాలింగ్ ప్రజెంటేషన్‌పై అభిప్రాయాలు తెలియజేయాలని టెలికాం సంస్థలను కోరింది. కాగా, బీఎస్ఎన్ఎల్, ఎయిర్‌టెల్, వోడాఫోన్, జియో వంటి టెలికాం సంస్థలు తమ అభిప్రాయాలను ట్రాయ్‌కు తెలియజేశాయి. ఈ నేమ్ కాలింగ్ ప్రజెంటేషన్‌పై కొన్ని అభిప్రాయాలను తెలియజేశాయి.
ఈ ఫీచర్ వల్లన వినియోగదారుల వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లుతుందని, సాంకేతికంగా అవరోధాలు ఏర్పడతాయని సదరు సంస్థలు ట్రాయ్‌కు తెలియజేశాయి. ఇలాంటి ఫీచర్‌ను తీసుకురావడం వలన యూజర్ల వ్యక్తిగత డేటా గోప్యతకు భద్రత కరువౌతుందని, నెట్ వర్క్‌కు ఇబ్బందులు కలుగుతాయని, అదేవిధంగా కాల్ సెటప్‌కు కూడా సమయం పడుతుందని జియో ఎయిర్‌టెల్ సంస్థలు తెలియజేశాయి. అంతేకాకుండా, ఈ ఫీచర్ కోసం ప్రత్యేకించి స్టోరేజ్‌ని యాడ్ చేసుకోవలసి వస్తుందని కూడా సదరు కంపెనీలు ట్రాయ్‌కి తెలియజేశాయి. ఒకవేళ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావాలంటే వ్యాల్యూ యాడెడ్ సర్వీస్‌గా మాత్రమే తీసుకురావాలని బీఎస్ఎన్ఎల్ తెలియజేసింది. ఈ ఫీచర్ అందుబాటులోకి రావడం ద్వారా ఫేక్, స్పామ్ కాల్స్ నుండి వినియోగదారులకు రక్షణ కలుగుతుందని ట్రాయ్ చెబుతున్నది.