టాటా అమ్ముల పొదిలో మరోఅస్త్రం… ఒకసారి ఛార్జింగ్ చేస్తే
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకు పెరుగుతున్నది. పెరుగుతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే అనేక వాహన తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్నాయి. భారతీయ దిగ్గజ వాహన సంస్థ టాటా మోటార్స్ ఇప్పటికే టిగోర్, నెక్సన్ ఈవీలను తయారు చేసింది. ప్రస్తుతం ఈ ఈవీ వాహనాలు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. అయితే, టాటా సంస్థ ఇప్పుడు కొత్తగా మరో ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చేందుకు రెడీ అయింది. ఎయూవీ కేటగిరిలో ఈ కారును తయారు చేస్తున్నది. కర్వ్ పేరుతో తయారు చేస్తున్న ఈ కారుకు సంబందించిన డిజైన్‌ను ఇటీవలే రిలీజ్ చేసింది. టిగోర్, నెక్సన్ మాదిరిగా జిప్‌ట్రాన్ ఫ్లాట్‌ఫామ్ పై కాకుండా సరికొత్త టెక్నాలజీతో కారును డిజైన్ చేస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక భద్రతతో పాటు, తక్కువ సమయంలో బ్యాటరీ ఛార్జింగ్ అయ్యేలా కారును డిజైన్ చేస్తున్నారు. ఒకసారి బ్యాటరీని ఛార్జింగ్ చేస్తే 400 నుంచి 500 కిమీ వరకు ప్రయాణం చేసుందుకు వీలుంటుందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం డిజైనింగ్ దశలో ఉన్న ఈ కాన్సెప్ట్ కారు విపణిలోకి రావడానికి రెండేళ్ల సమయం పడుతుందని టాటా మోటార్స్ తెలియజేసింది.