నిద్ర వద్దు- ఫోనే ముద్దు.. సర్వేలో హైదరాబాదీలకు షాకింగ్ అంశం!
హైదరాబాదీలకు నిద్ర కంటే ఫోన్ ఎక్కువైంది. నెటిజన్లలో అత్యధికంగా 41 శాతం మంది అర్ధరాత్రి తర్వాత కూడా స్మార్ట్‌ఫోన్లు చూస్తూ.. ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి యాప్‌లలో మునిగి తేలుతున్నారని ఒక సర్వేలో తేలింది. లేట్ నైట్ సోషల్ మీడియా వినియోగంలో దేశంలోనే మొదటిస్థానంలో హైదరాబాద్ ఉన్నట్టుగా ‘వేక్‌ఫిట్’ పరుపుల సంస్థ చేసిన సర్వేలో తేలింది. ఏడాది పాటు దేశవ్యాప్తంగా పలు మెట్రో నగరాలలో 30వేల మంది నెటిజన్లపై అధ్యయనం చేసి రూపొందించిన ‘గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్ కార్డ్ -2022’ వార్షిక నివేదికలో ‘వేక్‌ఫిట్’ ఈ వివరాలను ప్రస్తావించింది. లేట్‌నైట్ బ్రౌజింగ్‌లో అగ్రస్థానంలో ఉన్నా.. హైదరాబాద్ నెటిజన్లలో 15 శాతం మంది ఉదయాన్నే నిద్ర లేస్తున్నారని కూడా తేలింది. అయితే అలా లేస్తున్న వారిలో 49 శాతం మందికి ఆఫీసులలో నిద్ర ముంచుకొస్తోందని బదులిచ్చారు. వీరిలో 53 శాతం మంది ఐటీ ఉద్యోగులే అని కూడా తేల్చింది. నిద్రకు ఉపక్రమించే వరకూ ఫోన్‌నే అంటిపెట్టుకొని ఉంటున్నామని సర్వేలో పాల్గొన్న 87 శాతం మంది వెల్లడించారని కూడా పేర్కొంది.