Experiments Scientists:చీకట్లోనూ పంటలు పండించొచ్చు
Crops in Dark: సాధారణంగా మొక్కలు బతకాలంటే సూర్యరశ్మి కావాల్సిదే. అది లేకుంటే మొక్కలు, చెట్లు బతకలేవు. మొక్కలు నేల నుంచి పోషకాలను, నీటిని సంగ్రహించుకోగలిగినా.. సూర్యరశ్మి ఉన్నప్పుడే వాటిని పిండి పదార్థాలుగా మార్చుకోగలుగుతాయి. దీనినే కిరణ జన్య సంయోగ క్రియ అంటారు. వెలుతురు తగలకపోతే మొక్కలు ఎదగక పోగా అవి కొద్దిరోజుల్లోనే చనిపోతాయి.
కానీ అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు ఏ మాత్రం వెలుతురు లేని పరిస్థితుల్లో.. రాత్రిపూట కూడా మొక్కలు కిరణ జన్య సంయోగ క్రియ కొనసాగించేలా చేయగలిగారు. ఇది కేవలం మన ఇళ్లలోనో, రాత్రిపూటనో పంటలు పండించడానికో కాకుండా.. అంతరిక్షంలోనూ కావాల్సిన పంటలు పండించుకోవడానికి తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భవిష్యత్తులో అంగారకుడిపైకి మనుషులు వెళ్లే దిశగా పరిశోధనలు జరుగుతున్న నేపథ్యంలో.. అక్కడ పంటలు పండించుకోవడానికి ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
నిజానికి కిరణ జన్య సంయోగ క్రియ మరీ సమర్థవంతమైన ప్రక్రియ ఏదీ కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆకులపై పడే సూర్యరశ్మిలో మూడు నుంచి ఆరు శాతం వరకు మాత్రమే శక్తి ఉపయోగం అవుతుందని, మిగతాది వృథాగానే పోతుందని పేర్కొంటున్నారు. కిరణ జన్య సంయోగ క్రియ సామర్థ్యాన్ని పెంచగలిగితే.. పంట దిగుబడి పెరుగుతుందన్న ఉద్దేశంతో శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆకుల్లో సూర్యరశ్మి శక్తిగా ఎలా మారుతుందో గమనించి.. కరెంటు, ఇథనాల్, ప్లాస్టిక్ వంటివి తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయోగాలు చేస్తున్న సమయంలోనే వెనిగర్ అనే పదార్థం ఆధారంగా.. ముఖ్యమైన ఎసిటేట్ రసాయనాన్ని రూపొందించారు. ఈ ఎసిటేట్ను మొక్కలకు అందించి చూశారు. దీనితో పలు రకాల మొక్కలు చీకట్లోనూ శక్తిని ఉత్పత్తి చేసుకోగలిగినట్టు గుర్తించారు. వరి, శనగ, టమాటా, పొగాకు వంటి మొక్కలతోపాటు ఈస్ట్, నాచు, శిలీంధ్రాలపైనా ప్రయోగించగా.. అవన్నీ చీకట్లో ఎసిటేట్ సాయంతో శక్తిని ఉత్పత్తి చేసుకోగలిగినట్టు శాస్త్రవేత్తలు తేల్చారు.