Oppo: రూ. 4,390 కోట్ల మేర పన్ను ఎగవేతకు పాల్పడిన ఒప్పో స్మార్ట్ ఫోన్..డీఆర్ఐ సోదాల్లో వెల్లడి
Oppo Mobiles:అవినీతి, పన్ను ఎగవేతలకు పాల్పడిన చైనా మొబైల్ తయారీ దిగ్గజాలు షియామి, వివోలపై ఈడీ, ఆదాయ పన్ను శాఖ ఇప్పటికే చర్యలు తీసుకోగా తాజాగా మరో చైనా మొబైల్ కంపెనీ ఒప్పోపై ఆదాయ పన్ను అధికారులు దృష్టి సారించారు. 4 వేల 389 కోట్ల రూపాయల మేరకు కస్టమ్స్ డ్యూటీ ఎగవేతకు పాల్పడిందని ఒప్పోపై ఆరోపణలున్నాయి. దీంతో ఒప్పో భారత్ సబ్సిడరీ ఒప్పో మొబైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఒప్పో సంస్థ 4 వేల 398 కోట్లను పన్నులు కట్టకుండా ఎగవేతకు పాల్పడిందని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజన్స్ గుర్తించింది.
ఒప్పో ఇండియా మొబైల్ ఫోన్ల తయారీ, అసెంబ్లింగ్, హోల్సేల్ ట్రేడింగ్, మొబైల్ ఫోన్ల పంపిణీ, యాక్సెసరీస్ల వంటి వ్యాపార కార్యకలాపాలను భారత్లో నిర్వహిస్తుంది. ఒప్పో, వివోతో పాటు రియల్మి, వన్ప్లస్, ఐక్యూఓఓలను చైనాకు చెందిన బీబీకే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ప్రమోట్ చేస్తోంది. ఒప్పో ఇండియా కార్యాలయాలు, కీలక మేనేజ్మెంట్ ఉద్యోగుల కార్యాలయాలు, నివాసాల్లో జరిగిన సోదాల్లో కంపెనీ పలు అక్రమాలకు పాల్పడడం ద్వారా పన్ను ఎగవేతలకు పాల్పడినట్టు డీఆర్ఐ అధికారులు గుర్తించారు. పరికరాల దిగుమతి సమయంలో కస్టమ్స్ అధికారులకు తప్పుడు పత్రాలు, సమాచారం అందించామని దర్యాప్తులో వారు అంగీకరించారని సమాచారం.