Meta to introduce AI in Whatsapp and Insta: వాట్సప్ ఇన్‌స్టాలో ఏఐ సేవలు
Meta to introduce AI in Whatsapp and Insta: టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో బడా టెక్ కంపెనీల మధ్య పోటీ పెరిగిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అభివృద్ధి చెందడంతో టెక్ కంపెనీలు ఆ టెక్నాలజీని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థ ఇప్పటికే ఈ టెక్నాలజీని సెర్చ్ ఇంజిన్ కోసం వినియోగిస్తున్నది. అటు గూగుల్ కూడా ఈ టెక్నాలజీని బార్డ్ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రెండు సంస్థలు ఏఐ విభాగంలో దూకుడును ప్రదర్శించగా, ఇప్పుడు మెటా సంస్థ కూడా ఏఐ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. చాట్ జీపీటీ తరహలో టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.
ముందుగా టెక్ట్స్ ఫార్మాట్ యాప్ వాట్సప్, మెసెంజర్ యాప్‌లో ఈ తరహా చాట్‌బాట్ ను అందుబాటులోకి తీసుకురావాలని, అదే విధంగా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఇమేజ్ ఫిల్టర్ విభాగంలో ఏఐను అందుబాటులోకి తీసుకురావాలని ఆ సంస్థ నిర్ణయించింది. మెటా చీఫ్ ప్రొడక్ట్స్ ఆఫీసర్ క్రిస్ క్రాక్స్ ఏఐ టీమ్‌కు నేతృత్వం వహిస్తాడని మెటా అధినేత జూకర్‌బెర్గ్ తెలియజేశారు. ఇప్పటికే ప్రపంచ దేశాలను మాంద్యం వెంటాడుతున్నది. మాంద్యం దెబ్బకు పెద్ద ఎత్తున ఉద్యోగాలను కోల్పోతున్నారు. ఇదే సమయంలో ఏఐ టెక్నాలజీ వైపు ప్రపంచం అడుగులు వేస్తుండటంతో దానిని అందిపుచ్చుకునేందుకు పెద్ద మొత్తంలో టెక్ కంపెనీలు నిధులను వెచ్చిస్తున్నాయి.