Layoff Continue in Microsoft: మాంద్యం మాయ… ఒక్కడు కాదు… టీమంతా…
Layoff Continue in Microsoft: కరోనా నుంచి కోలుకొని తిరిగి గాడిలో పడుతున్న టెక్ కంపెనీల నెత్తిన మాంద్యం గుదిబండలా తయారైంది. మాంద్యం రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీలు భారం తగ్గించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ ప్రయత్నాల్లో భాగంగానే కంపెనీలు ముందుగా ఉద్యోగులను తొలగించుకుంటున్నాయి. చిన్న కంపెనీల నుండి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన టెక్ కంపెనీల వరకు ఇదే చేస్తున్నారు. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లుగా, మాంద్యం భారం నుండి ఎంత వీలైతే అంత బయటపడేందుకు ఉద్యోగులను తొలగిస్తున్నారు. గూగుల్, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులకు లేఆఫ్ చేస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు లక్షకుపైగా టెకీలు ఉద్యోగాలు కోల్పోయారు.
తాజాగా మైక్రోసాఫ్ట్ సంస్థ మరికొంత మందిని తొలగించింది. సాధారణ సాఫ్ట్ వేర్ ఉద్యోగుల నుండి ప్రాజెక్ట్ మేనేజర్, అవసరం అనుకుంటే అంతకంటే పైస్థాయి ఉద్యోగులను కూడా పక్కన పెడుతున్నది. కాగా, ఇప్పుడు కొత్తగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మైక్రోసాఫ్ట్ సంస్థ. ఆ సంస్థలో పని చేస్తున్న భారతీయ ప్రాజెక్ట్ మేనేజర్‌ను తొలగించింది. ఎనిదేళ్లపాటు ఆయన ఆ కంపెనీకి సేవలు అందించాడు. ఇందులో కొత్తేముంది అనుకోకండి. ఆయనతో పాటు, ఈ మేనేజర్‌తో కలిసి పనిచేసిన టీమ్ మొత్తాన్ని కంపెనీ తొలగించింది. దీంతో ప్రాజెక్ట్ మేనేజర్ వందన్ కౌశిక్ షాక్ అయ్యాడు. సంస్థలో పనిచేసిన అనుభవాలను సోషల్ మీడియాలో పేర్కొంటూ ఈ విషయాలను పేర్కొన్నారు.