I-Sim Technology: ఇక సిమ్‌కార్డులతో పనిలేదు!
I-Sim Technology: సాధారణ సిమ్‌కార్డులకు కాలం చెల్లి వాటి స్థానంలో డిజిటల్ సిమ్‌లు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆండ్రాయిడ్ లో రాలేదు కానీ యాపిల్ ఐఫోన్ 14, 14ప్రో మోడల్‌లలో ఇప్పటికే ఈ-సిమ్ టెక్నాలజీ ఉంది. ఇక ఇప్పుడు మరో కొత్త టెక్నాలజీ రాబోతోందని అంటున్నారు. అదేమంటే క్వాల్‌కామ్, థేల్స్ సంయుక్తంగా మొదటిసారి ఇంటిగ్రేటెడ్ సిమ్(ఐ-సిమ్) సర్టిఫికేషన్‌ను ప్రకటించాయి. దీంతో ఇక ఫోన్‌లలో సాధారణ సిమ్ కార్డులతో పని ఉండదు. స్నాప్ డ్రాగన్ 8 Gen 2తో ప్రారంభమయ్యే అన్ని ఫోన్‌ల ప్రధాన ప్రాసెసర్‌లో ఈ ఐ-సిమ్‌ను పొందుపరచనున్నారు. దీనివల్ల మరిన్ని అదనపు ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ఐ-సిమ్ కూడా ఈ-సిమ్ లాగా రిమోట్ ప్రొవిజనింగ్ స్టాండర్డ్ సపోర్ట్ చేస్తుందని అంటున్నారు. అంటే మొబైల్ ఆపరేటర్లు ఈ-సిమ్ టెక్నాలజీ సపోర్ట్ కోసం ఫోన్‌లను ప్రత్యేకంగా అప్‌గ్రేడ్ చేయనవసరం లేదు, ఫోన్‌లలో సిమ్ స్లాట్ ఉండదు కాబట్టి ఆ స్థలాన్ని పెద్ద బ్యాటరీలు, ఇతర ముఖ్యమైన భాగాలను చేర్చడానికి ఉపయోగించుకోవచ్చని అంటున్నారు. జీఎస్‌ఎం అసోసియేషన్ ఆమోదించిన ఈ ఐ-సిమ్ టెక్నాలజీ అభివృద్ధిపై క్వాల్‌కాం టెక్నాలజీస్, థేల్స్ సంస్థలు చాలా ఏళ్లుగా కృషి చేస్తున్నాయని అంటున్నారు.