Google Fired Employees: ఆగని కోతలు… పనితీరు ముఖ్యం కాదు
Google Fired Employees: ఆర్ధిక మాంద్యం, ద్రవ్యోల్భణం కారణంగా ప్రముఖ కంపెనీలు ఉద్యోగులను వరసగా తొలగిస్తున్నాయి. మెటా, అమెజాన్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సంస్థ సైతం ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంటున్నది. అయితే, ఏ ఉద్యోగిని ఎప్పుడు ఏ విధంగా తొలగిస్తారో కంపెనీ సైతం ముందుగా చెప్పడం లేదు. కాసేపట్లో విధులకు హాజరుకావాల్సి ఉండగా, సాయంత్రం వేళ్లే సమయంలో, మీటింగ్‌లకు అటెండ్ అయ్యే సమయాల్లో ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఎలాంటి కారణాలు చెప్పకుండా తొలగించడంతో ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు.
టాలెంట్ బేస్ చేసుకొని ఉద్యోగాలను తొలగిస్తున్నారని అనుకుంటే అదీ కూడా కాదని తేలిపోయింది. గూగుల్ క్లౌడ్ క్రోమ్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న గురుగ్రామ్‌కు చెందిన ఆకృతి వాలియా ఉద్యోగాన్ని చాలా విచిత్రంగా కొల్పోయింది. గూగుల్ మీట్ మీటింగ్ కోసం హాజరయ్యే 10 నిమిషాల ముందు తనను విధుల నుండి తొలగించినట్లు పేర్కొన్నారు. మీట్ బాక్స్ ఒపెన్ కాకపోవడంతో అధికారులను సంప్రదించగా, తనను ఉద్యోగం నుండి తొలగించినట్లు తెలిసి వాపోయినట్లు ఆమె సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 40 సంవత్సరాలకు పైబడిన మహిళ ఉద్యోగాలు కొల్పోతున్నట్లుగా కూడా నివేదికలు చెబుతున్నాయి. కోతలకు పనితీరు ముఖ్యంకాదని, అవసరం లేదని అనుకుంటే వెంటనే వారిని తొలగిస్తున్నారని ఉద్యోగులు వాపోతున్నారు.