Elon Musk: మాజీ ఉద్యోగిపై సంచలన వ్యాఖ్యలు.. సారీ చెప్పిన మస్క్!
Elon Musk: ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత తాను తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రకటనలతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ట్విట్టర్‌ను చేజిక్కించుకున్న మరుసటి రోజు నుంచే తనదైన నిర్ణయాతో ఉద్యోగులతో పాటు యూజర్లకు షాక్ ఇస్తున్న మస్క్ ప్రతి అంశంపై ఎక్కడా తగ్గకుండా అన్ని విషయాల్లో కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా ట్విట్టర్ మాజీ ఉద్యోగి ఒకరితో మస్క్ చేసిన చాట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో సదరు ఉద్యోగి వాస్తవ పరిస్థితి ఏమిటో తెలుసుకోకుండా మాట్లాడానని అందుకు క్షమించాలని ఉద్యోగిని కోరారు ఎలాన్ మస్క్. అసలు విషయం ఏమిటంటే ట్విట్టర్ ఉద్యోగ కోతల్లో భాగంగా హరాల్దుర్ థోర్లిప్సన్ అనే వ్యక్తి కూడా జాబ్ కోల్పోగా అప్పటికే ఆయన కండరాల బలహీనతతో బాధపడుతున్నారు. ఈ జ్రనంకి తనను తొలగించిన తీరు సరికాదని, ఆఫర్ చేసిన పరిహార ప్యాకేజీ పైనా ట్విట్టర్‌లో రాసుకొస్తూ భావోద్వేగానికి గురయ్యారు, అయితే హరాల్దుర్ థోర్లిప్సన్ ట్వీట్‌కు స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎలాన్ మస్క్. కంపెనీకి థోర్లీప్సన్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, ఇప్పటికే చాలా ఆస్తులు ఉన్నా భారీ పరిహారం కోసం డిమాండ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మస్క్ వ్యాఖ్యలపై హరాల్దుర్ స్పందిస్తూ తను శారీరక లోపం వల్ల కదల్లేకపోతున్నానని, కానీ, మస్క్ మాత్రం దృఢంగా ఉన్నా సెక్యూరిటీ సాయం లేకుండా వాష్‌రూంకి కూడా వెళ్లడం లేదని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో థోర్లీప్సన్ పరిస్థితి తనకు తెలియదని, అతని గురించి చెప్పిన వారు సరిగా వివరించలేదని, అందువల్ల తప్పు దొర్లింది, అపార్థం చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పారు.