Bluesky APP: అందుబాటులోకి బ్లూస్కై… ట్విట్టర్‌కు ఇబ్బందులే
Bluesky APP: సామాజిక మాధ్యమాల్లో ట్విట్టర్‌కు ఒక గుర్తింపు ఉన్నది. జాక్‌డొర్సే సీఈవోగా ఉన్న సమయంలో ట్విట్టర్ స్వర్ణయుగంగా నడిచింది. అయితే, ఆయన బాధ్యతల నుండి తప్పుకున్నాక ట్విట్టర్‌ను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కొనుగోలు చేశాడు. ఈ కోనుగోలు అనంతరం ట్విట్టర్‌లో మార్పులు చేయడం, కమర్షియల్‌గా అందుబాటులోకి తీసుకురావడం, బ్లూటిక్ మార్క్ కోసం చెల్లింపులు విధించడంతో ట్విట్టర్ పరపతి కొంతమేర దెబ్బతిన్నది. ట్విట్టర్ నుండి బయటకు వచ్చిన జాక్‌డొర్సే చాలా రోజుల క్రితం ట్విట్టర్ వంటిదే మరొకటి క్రియేట్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు.
ట్విట్టర్ కంటే కూడా ఇంటర్‌ఫేజ్ అద్భుతంగా ఉంటుందని ప్రకటించాడు. అనుకున్నట్లుగానే బ్లూస్కై పేరుతో మైక్రోబ్లాగింగ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం ఈ యాప్ యాపిల్ స్టోర్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇన్విటేషన్ ద్వారా ప్రస్తుతం ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉన్నట్లు జాక్‌డొర్సే తెలియజేశారు. త్వరలోనే యాపిల్ తో పాటు ఆండ్రాయిడ్ స్టోర్‌లోనూ అందుబాటులోకి రానున్నట్లు జాక్ డొర్సే తెలియజేశారు. ఇందులో 256 అక్షరాలతో పోస్ట్ చేసుకునేందుకు వీలు ఉంటుందని ఆయన తెలియజేశారు. బ్లూ స్కై ఆండ్రాయిడ్ స్టోర్‌లో కూడా అందుబాటులోకి వస్తే ట్విట్టర్‌పై ప్రభావం పడే అవకాశం ఉంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.