Nikhat Zareen: ఒలింపిక్ గోల్డ్, సల్మాన్ ఖాన్ తో డాన్స్.. నిఖత్ జరీన్ టార్గెట్స్ ఇవే
Won’t Breathe Easy Till I Win Olympic Gold, says Nikhat Zareen
తెలంగాణ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ తన మనసులోకి కోరికలను బయటపెట్టింది. వచ్చే ఒలింపిక్స్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించడమే తన లక్ష్యమని, స్వర్ణం సాధించే వరకు విశ్రమించేది లేదని మరోసారి స్పష్టం చేసింది. ఈ కోరికతో పాటు మరో కోరికను కూడా బయటపెట్టింది. గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో ఒక్కసారి డాన్స్ చేయాలని ఉందని కూడా నిఖత్ జరీన్ తెలిపింది.
గత ఏడాదిలో కూడా ఓ సారి సల్మాన్ ఖాన్ తో కలిసి నిఖత్ జరీన్ డాన్స్ చేసింది. ఒలింపిక్ గోల్డ్ గెలిచిన తర్వాత మరోసారి డాన్స్ చేయాలని భావిస్తోంది. తెలంగాణలో భారీ స్థాయిలో బాక్సింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలని కూడా ఉందని నిఖత్ జరీన్ తెలిపింది. కోల్ కతాలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో నిఖత్ జరీన్ ఈ వ్యాఖ్యలు చేసింది.
2024లో పారిస్ నగరంలో జరిగే ఒలింపిక్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించాలని 2021 లోనే టార్గెట్ ఫిక్స్ చేసుకుంది నిఖత్ జరీన్. అప్పటి నుంచే అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. దేశమంతా గర్వించే స్థాయిలో తన సత్తా చాటుతానని నిఖత్ జరీన్ అనేక సందర్భాల్లో విశ్వాసం వ్యక్తం చేసింది.
నిఖత్ జరీన్ గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ టోర్నీలలో అదరగొడుతోంది. తన పంచ్ పవర్ తో ప్రత్యర్ధులను చిత్తు చేస్తూ పతకాలను సాధిస్తోంది. గత ఏడాది బర్మింగ్ హంలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో సత్తా చాటి బంగారు పతకం సాధించింది. అదే విధంగా ఇస్తాంబుల్ నగరంలో జరిగిన బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో కూడా తిరుగులేని విజయం సాధించింది. గోల్డ్ మెడల్ సాధించింది.
నిఖత్ జరీన్ విజయపరంపరకు తెలంగాణ ప్రభుత్వం కూడా వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తోంది. నగదు బహుమతిని కూడా ప్రకటించింది. విజయోత్సవ ర్యాలీలు కూడా ప్రభుత్వం నిర్వహించింది.