INDvsSA: నేడే దక్షిణాఫ్రికా తో ఆఖరి వన్డే
INDvsSA: మూడు వన్డేల సిరీస్‌లో భారత్-దక్షిణాఫ్రికా చెరో మ్యాచ్ గెలవడంతో నిర్ణాయక ఆఖరి వన్డే ఆసక్తికరంగా మారనుంది. ఇరుజట్ల మధ్య మంగళవారం అరుణ్‌జైట్లీ మైదానంలో ఈ పోరు జరుగనుంది. పర్యాటక జట్టు సిరీస్ నెగ్గి ఆత్మవిశ్వాసంతో తమ గడ్డ పై అడుగుపెట్టాలనుకుంటోంది. అంతేకాకుండా వరల్డ్‌కప్ సూపర్ లీగ్ పట్టికలో ఈ జట్టు తమ స్థానాన్ని మెరుగుపర్చుకోవాల్సి ఉంది.
సొంతగడ్డపై శిఖర్ ధవన్ సేనకు షాకివ్వాలని దక్షిణాఫ్రికా జట్టు తహతహలాడుతున్నది. తొలి వన్డేలో సఫారీల వెన్ను విరిచిన హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు. కెప్టెన్ శిఖర్ ధవన్‌తో పాటు మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా రాణిస్తే టీమ్‌ఇండియాకు తిరుగుండదు. మిడిలార్డర్‌లో సంజూ శాంసన్ తన విలువ చాటుకుంటుండగా.. శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ రూపంలో ఇద్దరు ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉన్నారు. గత మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన షాబాజ్ అహ్మద్‌కు మరో అవకాశం దక్కుతుందా లేక.. మీడియం పేసర్ ముఖేశ్ తొలి వన్డే ఆడుతాడా చూడాలి.
కొన్ని రోజులుగా వర్షాలు దంచికొడుతుండటంతో మ్యాచ్ సజావుగా సాగుతుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే మంగళవారం వర్షం కురిసే అవకాశా లు కాస్త తక్కువ ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.