India Vs Australia: కష్టాల్లో భారత్, 39 పరుగులకే 4 వికెట్లు డౌన్
Team India lost 4 early Wickets in the First ODI
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ కష్టాల్లో పడింది. కేవలం 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ఔటయ్యారు. ఇషాన్ కిషన్ 3 పరుగులు చేయగా…కోహ్లీ 4 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ ఖాతా తెరవకముందే పెవిలియన్ చేరాడు. శుభ్మన్ గిల్ 20 పరుగులు చేశాడు. మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడగొట్టి భారత జట్టును దెబ్బతీశాడు. మార్కస్ స్టెయినోసిస్ ఒక వికెట్ తీశాడు. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ జట్టును గాడిలో పెట్టే పనిలో పడ్డారు.
ఆసీస్ 188 పరుగులు
తొలిత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు 188 పరుగులు చేసింది. మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీలు ఇద్దరూ చెరో మూడేసి వికెట్లు పడగొట్టి ఆసీస్ జట్టును దెబ్బ తీశారు. రవీంద్ర జడేజా 2 వికెట్లు, కులదీప్ యాదవ్, హార్ధిక్ పాండ్యాలకు చెరో వికెట్ లభించింది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ ఒక్కడే బాగా ఆడాడు. మిచెల్ మార్ష్ భారత బౌలర్లను అద్భుతంగా ఎదుర్కొని పరుగుల వరద పారించాడు. 65 బంతుల్లోనే 10 ఫోర్లు 5 సిక్సర్లతో 81 పరుగులు చేశాడు. మిచెల్ మార్ష్ ఔట్ అయిన దగ్గర నుంచి ఆసీస్ బ్యాటింగ్ గాడి తప్పింది. స్టీవ్ స్మిత్ 22 పరుగులు చేశాడు.
ఆసీస్ జట్టు టాపార్డర్ ఔటైన తర్వాత భారత బౌలర్లు మరింత విజృంభించారు. షమీ, సిరాజ్, జడేజాలు అద్భుతంగా బౌలింగ్ చేశారు. 168 పరుగులకు 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 188 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్లు, టైలెండర్లు చతికిల పడిపోయారు. పరుగులు చేయలేక చేతులెత్తేశారు.