Shubman Gill: ఎన్టీఆర్ ను కలిసాక..ఉప్పల్ లో నాటు కొట్టుడు..
Shubman Gill scripts new record in Hyderabad Uppal Stadium: ఏమా సొగసు..? ఏమా టైమింగ్..? కళాత్మక ఇన్నింగ్స్ అంటే ఇదేనేమో..? చూసేందుకు రెండు కళ్లూ చాలలేదు.. బంతి కాస్త గతి తప్పినా బౌండరీ.. కళ్లుచెదిరే ఆట.. సిక్స్ తో హాఫ్ సెంచరీ.. 93 మీద ఉండగా సిక్స్ తో సెంచరీకి చేరువ.. ఇక డబుల్ సెంచరీకి ముంగిట ఎవరైనా కాస్త తటపటాయిస్తారు.. కొత్త కుర్రాళ్లయితే ఒత్తిడిలో ఉంటారు.
అవతలి ఎండ్ లో వికెట్లు పడుతుంటే కాస్త జాగ్రత్తగా ఆడి డబుల్ సెంచరీని అందుకుంటారు. కానీ, అతడికి అదేమీ లేదు. హ్యాట్రిక్ సిక్స్ లతో 200 మార్క్ కొట్టేశాడు. అహో..ఇది కదా.. టీమిండియా కోరుకుంటున్న కొత్త రక్తం. ఇది కదా.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తర్వాత తరానికి కావాల్సిన సామర్థ్యం..
టీమిండియా యువ ఓపెనర్ శుబ్ మన్ గిల్ నాటు కొట్టుడు కొట్టాడు. బహుశా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను కలిసిన ఉత్సాహమో ఏమో..? నాటు నాటుగా దంచేశాడు. అలా యంగ్ టైగర్ ను కలవడం.. ఇలా దంచేయడం.. గిల్ అసమాన ఇన్నింగ్స్ ను ఎంత వర్ణించినా తక్కువే. న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో గిల్ డబుల్ సెంచరీ (208; 149 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్స్‌లు) తో పరుగుల సునామీ సృష్టించాడు. అతడి అత్యుత్తమ ఇన్నింగ్స్ తో టీమిండియా నిర్ణీత ర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఆదరాబాదరా బాదుడు లేదు.. మిస్ ప్లేస్ లేదు.. మిస్ టైమ్ లేదు.. గిల్ ఇన్నింగ్స్ మొదటి నుంచి అలాఅలా నదీ ప్రవాహంలా సాగిపోయింది. తనకే సొంతమైన సొగసుతో చక్కటి టైమింగ్ తో గిల్ కొట్టిన షాట్లు ఉప్పల్ లో అభిమానులను ఉర్రూతలూగించాయి. కెప్టెన్ రోహిత్ శర్మ (34), సూర్యకుమార్ యాదవ్ (31), హార్దిక్ పాండ్య (28) ఫర్వాలేదనిపించినా.. కోహ్లీ (8), ఇషాన్ కిషన్ (5) నిరాశపర్చారు. వాషింగ్టన్ సుందర్ (12), శార్దూల్ ఠాకూర్ (3) ఎక్కువ సేపు నిలవలేదు. కానీ, గిల్ అద్భుత ఇన్నింగ్స్ తో టీమిండియా 350 పరుగుల భారీ స్కోరు చేసింది.
శుబ్ మన్ గిల్ వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన ఐదో భారత క్రికెటర్. సచిన్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ తర్వాత ఈ ఘనత అందుకున్న క్రికెటర్. వీరిలో రోహిత్ శర్మ మూడుసార్లు ‘డబుల్’ సాధించాడు. సెహ్వాగ్ రెండు సార్లు 200 మార్క్ ను దాటాడు. మొత్తమ్మీద వన్డేల్లో టీమిండియాకిది ఎనిమిదో డబుల్ సెంచరీ. మరే దేశం ఖాతాలో ఇన్ని డబుల్ సెంచరీ లేవు. కాగా, గిల్ 87 బంతుల్లో శతకం, 145 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు. 122 బంతుల్లో 150 పరుగుల మార్కును దాటాక చెలరేగాడు. 23 బంతుల్లోనే మరో 50 పరుగులు చేశాడు. డబుల్ సెంచరీకి ముందు కేవలం 8 బంతుల్లో 31 పరుగులు చేశాడు. వీటిలో హ్యాట్రిక్ తో డబుల్ సెంచరీ మార్క్ అందుకున్న మూడు సిక్స్ లు సహా ఐదు సిక్స్ లు ఉన్నాయి. హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ కు మాత్రం మంచి మజా అందించాడు.