Shreyas Iyer: వన్డే సిరీస్ కు శ్రేయాస్ అయ్యర్ దూరం, రజత్ పటీదార్ కి ఛాన్స్
Shreyas Iyer to miss ODI Series with Australia
ఆసీస్ జట్టుతో జరగనున్న వన్డే సిరీస్ కు ముందు భారత జట్టుకు షాక్ తగిలింది. భారత బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. వన్డే సిరీస్ కు దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూర్ లోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్నాడు. బీసీసీఐ మెడికల్ స్టాప్ అయ్యర్ కు వైద్యం అందిస్తున్నారు.
వెన్నుగాయం కారణంగా శ్రేయాస్ అయ్యార్ నాల్గవ టెస్టులో బ్యాటింగ్ చేయడానికి దిగలేదు. మ్యాచ్ పూర్తికాకముందే అహ్మదాబాద్ నుంచి బెంగళూర్ పయనం అయ్యాడు. నాల్గవ టెస్టు తొలి ఇన్నింగ్స్ సందర్భంగా వరుసగా రెండు రోజుల పాటు ఫీల్డింగ్ చేసిన కారణంగా వెన్నుభాగంలో ఇబ్బంది ఏర్పడింది. వెంటనే స్కాన్ చేయించడానికి తీసుకువెళ్లారు. వైద్య నిపుణుల సూచనలు, సలహాల ఆధారంగా చికిత్స అందించడం జరుగుతుందని బీసీసీఐ అధికారులు వెల్లడించారు.
గత ఏడాది డిసెంబర్ నెలలో బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన సిరీస్ సందర్భంగా శ్రేయాస్ అయ్యర్ కి వెన్ను నొప్పి వచ్చింది. ఆ సమయంలో నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స అందించారు. కోలుకోడానికి చాలా కాలమే పట్టింది. ఆ కారణంగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్, బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్ లో భాగంగా నాగ్ పూర్ నగరంలో జరిగిన మొదటి మ్యాచ్ మిస్ అయ్యాడు. ప్రస్తుతం ఆ గాయం తిరిగబెట్టింది. దీంతో శ్రేయాస్ అయ్యర్ స్థానంలో రజత్ పటీదార్ ఆడే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ ఈ విషయం జోరుగా ప్రచారం జరుగుతోంది.