India VS West Indies: సిరీస్ విజయంపై కన్నేసిన భారత్
వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. ఉత్కంఠ భరితంగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్లు బ్యాటింగ్ విభాగంలో అదరగొట్టగా, బౌలింగ్ విభాగంలో మహ్మద్ సిరాజ్ అదరహో అనిపించాడు. రెండో మ్యాచ్‌లో కూడా గెలవడం ద్వారా సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత్ తహతహలాడుతోంది.
పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో క్వీన్స్ పార్క్ ఓవల్‌లో జరగనున్నరెండో వన్డే మ్యాచ్‌లో మిడిల్ ఆర్డర్లో లోపాలను సరిచేసుకుని భారత్ బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి మ్యాచ్‌లో మిడిలార్డర్ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. గాయం కారణంగా రవీంద్ర జడేడా లేకపోవడం భారత జట్టుకు పెద్ద లోపంగా మారింది.
జట్టుకు దూరమైన జాసన్ హోల్డర్
విండీస్ జట్టు కూడా కొన్ని సమస్యలతో ఇబ్బంది పడుతోంది. కరోనా సోకడంతో జాసన్ హోల్డర్ జట్టుకు దూరమయ్యాడు. ఈ ప్రభావం తొలి మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది. రెండో మ్యాచ్‌లో కూడా హోల్డర్ లేకుండానే విండీస్ జట్టు ఆడనుంది.
బ్యాటింగ్ పిచ్
క్వీన్స్ పార్క్ ఓవల్ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. 300 పరుగులు సాధించడం సర్వసాధారణంగా కనిపిస్తోంది. ఇటువంటి పిచ్‌పై ఛేజింగ్ చేసే జట్టుకే విజయావకాశాలు ఎక్కువుగా ఉంటాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
శ్రేయాస్ అయ్యర్‌పైనే అందరి చూపు
తొలి మ్యాచ్‌లో భారత ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా రాణించాడు. 57 బంతుల్లో 54 పరుగులు చేశాడు. 5 బౌండరీలు, రెండు సిక్సర్లు బాదాడు. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు ఎదుర్కోవడంలో విజయం సాధించాడు. రెండో వన్డేలో కూడా తన ఫామ్‌ను కొనసాగించి మరింత భారీ స్కోర్ చేసే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
యజువేంద్ర చాహల్ మ్యాజిక్
తొలి వన్డేలో చాహల్ చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. విండీస్ ఆటగాళ్లను కట్టడి చేశాడు. పరుగులు చేయకుండా నిలువరించగలిగాడు. కీలకమైన రోవ్‌మెన్ పావెల్ వికెట్‌ను పడగొట్టాడు. కెప్టెన్ ఆదేశాలకు అనుగుణంగా బౌలింగ్ చేస్తూ మ్యాచ్ స్పరూపాన్నే మార్చేయగల సత్తా కలిగిన చాహల్ రెండో వన్డేలో కూడా సత్తా చాటుతాడని అభిమానులు ఆశిస్తున్నారు.