India Vs NZ : సత్తా చాటుతాం – ఎవరేంటో మాకు తెలుసు..కెప్టెన్ల ధీమా
Rohit Sharma and Tom Lutham Confident on Winning Hyderabad ODI: హైదరాబాద్ లో క్రికెట్ ఫీవర్ మొదలైంది.ఉప్పల్ స్టేడియంలో భారత్, న్యూజీలాండ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ కు సర్వం సిద్దమైంది. భారీగా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. రెండు జట్లు స్టేడియంలో ముమ్మరంగా ప్రాక్టీసు చేస్తున్నాయి. ఐపీఎల్, ప్రపంచ కప్ కు సన్నాహకాల్లో భాగంగా ఈ సిరీస్ ను ఇరు జట్లు సీరియస్ గా తీసుకుంటున్నాయి. ఈ మ్యాచ్ గురించి ఇద్దరు కెప్టెన్లు తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. తాము బలమైన జట్టుతో ఆడుతున్నామని భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పారు. తమ టీం శక్తి సామర్ధ్యాలను పరీక్షించుకోవటానికి ఇదో మంచి అవకాశం గా పేర్కొన్నారు. శ్రీలంకతో సిరీస్ ఆడని ఇషాన్ కిషన్ ను ఈ సారి మిడిల్ ఆర్డర్ లో అవకాశం ఇస్తామన్నారు.
సిరాజ్ బాగా ఆడుతున్నాడంటూ రోహిత్ కితాబిచ్చారు. గ్రాఫ్ పెరుగుతూనే ఉందన్నారు. కొత్త బాల్స్ తో వికెట్స్ తీస్తున్న సిరాజ్ కు హైదరాబాద్ హోం గ్రౌండ్. ఇక్కడ తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతున్న సిరాజ్ కు రోహిత్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. మూడు ఫార్మాట్స్ లోనూ సిరాజ్ ముఖ్యమైన ప్లేయర్ గా పేర్కొన్నారు. ప్రత్యర్ధి టీం ఎలా ఉన్నారో ఎక్కువ ఆలోచన చేయమని రోహిత్ చెప్పారు. తమ టీం సభ్యుల శక్తి సామర్ధ్యాల పైనే ఎక్కువగా తమ దృష్టి ఉంటుందన్నారు. స్పిన్నర్లు చాహల్ అక్షర్ , శబాష్ , కూల్దిప్ అందుబాటు లో ఉన్నారని, పిచ్ స్వభావంకు అనుగుణంగా తుది జట్టు ఎంపిక చేస్తామని రోహిత్ పేర్కొన్నారు.
భారత్ లో జరిగే ప్రపంచ కప్ ముందు ఈ సిరీస్ తమకు ముఖ్యమైనదని న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ విశ్లేషించారు. విలియమ్సన్, సౌతీ లేకపోవడంతో.. యంగ్ ప్లేయర్స్ కి అవకాశం లభించిందన్నారు. ఇది కూడా మంచి పరిణామంగా వివరించారు. తాము పాకిస్థాన్ తో 2-1 తేడాతో గెలిచామని, అక్కడ కూడా ఏషియన్ కండిషన్స్ కాబట్టి అది కూడా తమకు అడ్వాంటేజ్ అయ్యిందని చెప్పారు. ఇండియాలో పిచ్ లు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికీ అనుకూలంగా ఉంటాయన్నారు. పిచ్ కు తగ్గట్టు రాణించే టీం తమతో ఉందని ధీమా వ్యక్తం చేసారు. అందరం ఐపీఎల్ లో కలిసే ఆడిన విషయం గుర్తు చేసిన లాథమ్.. ఎవరి పర్ఫార్మెన్స్ ఏంటో తమకు పూర్తి అవగాహన ఉందన్నారు.