Md Siraj: వరల్డ్ నెంబర్ 1 బౌలర్ మహ్మద్ సిరాజ్, ఐసీసీ ప్రకటన
Md. Siraj becomes Number 1 in ICC ODI Player Rankings
టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బౌలర్లలో నెంబర్ 1 బౌలర్ గా అవతరించాడు. ఐసీసీ ప్రకటించిన వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ జట్టుకి చెందిన ట్రెంట్ బౌల్ట్, ఆస్ట్రేలియా సీమర్ జోష్ హాజల్ వుడ్ ఇద్దరినీ వెనక్కి నెట్టి టాప్ పొజిషన్ చేరాడు సిరాజ్. వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్ లో 729 రేటింగ్ పాయింట్లు సాధించాడు.
గత ఏడాది ఫిబ్రవరిలో భారత వన్డే జట్టులోకి సిరాజ్ వచ్చి చేరాడు. అంతకు ముందు మూడేళ్ల పాటు భారత్ తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాని సిరాజ్, గత ఏడాదిలో రీ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. వన్డే మ్యాచుల్లో తనకు తిరుగులేదని అనిపించుకున్నాడు. పవర్ ప్లే సందర్భంగా వికెట్లు ఎలా తీయాలో ఖచ్చితంగా నేర్చుకున్నాడు. జట్టు అవసరాలకు తగ్గట్లు తనని తాను మలచుకున్నాడు. టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మెంబ్రే ఇచ్చిన అదనపు కోచింగ్ సిరాజ్ మియాకు కలిసి వచ్చింది.
సిరాజ్ గత ఏడాదిలో ఆడిన 20 వన్డే మ్యాచుల్లో 34 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. ఈ ఏడాదిలో కూడా తన పామ్ కొనసాగించాడు. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్, న్యూజిలాండ్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్ లలో కూడా తన పదునైన బౌలింగ్ ద్వారా ప్రత్యర్ధులను హడలెత్తించాడు. సరైన సమయంలో వికెట్లు తీస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చాడు. అందరి ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో నిలిచాడు. దేశానికి గర్వకారణంగా నిలిచాడు.