నేటి నుంచి ఐపీఎల్.. కొత్త కొత్తగా?
క్రికెట్ ప్రేమికులందరూ పొట్టి క్రికెట్ ఫా పిలుచుకునే ఐపీఎల్ సరికొత్తగా ముస్తాబైంది. కొత్తగా లీగ్‌లోకి అడుగు పెట్టిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్‌లతో కలిపి ఈసారి పది జట్లు టైటిల్ కోసం హోరాహోరీ తలపడబోతున్నాయి. ఇప్పటిదాకా లీగ్ చరిత్రలో ఒక్క 2011 సీజన్లో మాత్రమే పది జట్లు పోటీ పడ్డాయి. మళ్ళీ ఇప్పుడు ఆ అవకాశం దక్కనుంది. ఇక ఈసారి మ్యాచ్‌ల సంఖ్య కూడా పెరగబోతోంది. అందుకే ఈసారి కాస్త ముందుగా, మార్చి చివరి వారంలోనే లీగ్‌ను మొదలు పెట్టేస్తున్నారు నిర్వాహకులు. శనివారం తొలి మ్యాచ్‌లో గత ఏడాది ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్, రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడబోతూ ఉండడం ఆసక్తికరంగా మారింది. అయితే కొవిడ్ ఇంకా పూర్తిగా తగ్గని నేపథ్యంలో ఈసారి లీగ్‌ను ముంబయి, పుణె నగరాలకు పరిమితం చేశారు. బయో బబుల్ ఏర్పాటయిన ముంబయిలోని వాంఖడె, బ్రబౌర్న్, డీవై పాటిల్ స్టేడియాలు.. పుణెలోని ఎంసీఏ మైదానం మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి.
ఈసారి జట్ల సంఖ్య పెరుగుతోంది, ఫార్మాట్ మారుతోంది కాబట్టి పోటీ పెరుగుతుంది. ప్రతి జట్టుకూ ప్రతి మ్యాచ్ కీలకమే కాబట్టి లీగ్ రసవత్తరంగా సాగడం ఖాయం అని అంటున్నారు. గత సీజన్ వరకు లీగ్‌లో ప్రతి జట్టూ మిగతా ఏడు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడేది. మొత్తంగా ప్రతి జట్టుకూ 14 మ్యాచ్‌లు ఉండేవి. ఈ సీజన్లో రెండు జట్లు పెరిగినప్పటికీ.. ఒక్కో జట్టు ఆడే మ్యాచ్‌ల సంఖ్య పెరగబోదని అంటున్నారు. పది జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్‌లో ప్రతి జట్టూ మిగతా నాలుగు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. అలాగే అవతలి గ్రూప్‌లో తనతో సరిసమాన స్థాయిలో ఉన్న జట్టుతో రెండు మ్యాచ్‌లు, మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుందన్న మాట ఈ ప్రకారం ఒక్కో జట్టు ఆడే మొత్తం మ్యాచ్‌లు 14 అవుతాయి. ఈసారి ఐపీఎల్‌లో 10 జట్లు ఉండగా 74 మ్యాచ్‌లు ఉండనున్నాయి.