వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ (World Athletics Championship)టోర్నీలో భారత జావెలిన్ త్రో ప్లేయర్స్ (Javelin throw players) దుమ్మురేపారు. గోల్డెన్ భాయ్ నీరజ్ చోప్రాతో పాటు డీపీ మనూ, కిశోర్ జేనా ఫైనల్‌కు అర్హత సాధించారు.
Indian javelin Players : వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ (World Athletics Championship)టోర్నీలో భారత జావెలిన్ త్రో ప్లేయర్స్ (Javelin throw players) దుమ్మురేపారు. గోల్డెన్ భాయ్ నీరజ్ చోప్రాతో పాటు డీపీ మనూ, కిశోర్ జేనా ఫైనల్‌కు అర్హత సాధించారు. క్వాలిఫయర్స్‌లో (qualifiers)తొలి ప్రయత్నంలోనే ఈ సీజన్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన నీరజ్ చోప్రా(Neeraj Chopra) ఫైనల్ బెర్త్‌తో పాటు పారిస్ ఒలింపిక్స్‌కు (Paris Olympics)అర్హత సాధించాడు.
క్వాలిఫయింగ్ గ్రూప్-ఏలో పోటీపడిన నీరజ్ చోప్రా జావెలిన్‌ను 88.77 మీటర్ల దూరం విసిరాడు. భారత్‌కే చెందిన మరో జావెలిన్ త్రో ప్లేయర్ మను తొలి రౌండ్‌లో 78.10 మీటర్లు విసరగా.. రెండో ప్రయత్నంలో 81.31 మీటర్లే విసిరాడు. మూడో ప్రయత్నంలో 72.40 మీటర్లకే పరిమితమయ్యాడు. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ సాధించిన మనూ.. బెస్ట్ పెర్ఫామెన్స్ 81.31 మీటర్లతో 6వ స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్ దక్కించుకున్నాడు.
గ్రూప్-బిలో పోటీపడిన కిశోర్ జేనా జావెలిన్‌ను 80.55 మీటర్లు విసిరి 9వ స్థానం నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. మొత్తం 12 మంది ఫైనల్‌కు అర్హత సాధించగా ఇందులో ముగ్గురు భారత ఆటగాళ్లే ఉండటం విశేషం. వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలోనే ముగ్గురు భారత ఆటగాళ్లు ఫైనల్ చేరడం ఇదే తొలిసారి.
ఫైనల్ చేరిన 12 మందిలో నీరజ్ చోప్రా 88.77 మీటర్లతో అగ్రస్తానంలో నిలవగా.. పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ 86.79 మీటర్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఈ ఇద్దరూ ప్యారిస్ ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్నారు. టోక్యో ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ జాకుబ్ వాద్లెచ్ 83.50 మీటర్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఆదివారం జావెలిన్ త్రో ఫైనల్ పోటీలు జరగనున్నాయి.
గతేడాది జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ సాధించాడు. లాంగ్ జంపర్ అంజు బాబి జార్జ్ తర్వాత ఈ ఘనతను అందుకున్న భారత అథ్లెట్‌గా నిలిచాడు. 2003 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అంజు బాబీ జార్జ్ సిల్వర్ మెడల్ సాధించింది. గతేడాది 88.13 మీటర్ల దూరం విసిరిన నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 90.54 మీటర్లు విసిరి స్వర్ణ పతకం దక్కించుకున్నాడు. టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించి గోల్డెన్ బాయ్‌గా మారాడు. 2018లో ఆసియా క్రీడల్లో స్వర్ణం, 2018లో కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణం, 2022లో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో రజత పతకాలు సాధించాడు.