IND vs ENG: దుమ్ము రేపిన భారత బౌలర్లు.. 111 పరుగులకే కుప్ప కూలిన ఇంగ్లండ్
IND vs ENG 1st ODI: ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు దుమ్ము రేపుతోంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా.. ఇవాళ జరుగుతోన్న వన్డే మ్యాచ్‌లో పట్టు బిగించింది. భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దెబ్బకు ఇంగ్లండ్ బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. కేవలం 7.2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన బుమ్రా 6 వికెట్లను పడగొట్టాడు. మొదటి నుంచి పదునైన బంతులతో విరుచుకుపడ్డ బుమ్రా.. ఇంగ్లండ్ బ్యాటర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుసగా వికెట్లు తీశాడు. బుమ్రా దెబ్బకు ఇంగ్లీష్ టీమ్ 25.2 ఓవర్లలోనే 110 పరుగులకు ఆలౌట్ అయ్యింది. బుమ్రాతో పాటు మహ్మద్ షమీ 3 వికెట్లు తీసుకోగా.. ప్రిసిద్ధ కృష్ణకు ఓ వికెట్ దక్కింది.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన స్టార్ బ్యాటర్ జాసన్ రాయ్ డకౌట్ అయ్యాడు. బుమ్రా బౌలింగ్‌లో అతడు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే జో రూట్ కూడా బుమ్రా బౌలింగ్‌లోనే వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేతికి దొరికిపోయాడు. రూట్ కూడా డకౌట్గానే వెనుదిరిగాడు. లియామ్ లివింగ్స్టోన్లను కూడా బుమ్రా డకౌట్గానే పెవిలియన్ చేర్చాడు. మరో కీలక బ్యాటర్ బెన్ స్టోక్స్ కూడా షమీ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. ఇలా కీలక బ్యాటర్లంతా వరుసగా పెవిలియన్ చేరుతుండటంతో ఇంగ్లండ్ శిబిరం ఆందోళనలో కూరుకుపోయింది. జాస్ బట్లర్ 30, డేవిడ్ విల్లీ 21 మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు.